‘దీక్షా’ధారులు .. వైఎస్సార్ సీపీ నేతల నిరశన
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు నిరవధిక నిరహారదీక్షలు చేపడుతున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమిస్తున్నా సమైక్యమే ధ్యేయంగా దీక్షలు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డిలు చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారంతో మూడోరోజుకు చేరింది. వీరికి సంఘీభావం పలికేందుకు వస్తున్న జనసందోహంతో ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం రాత్రికి రవీంద్రనాథరెడ్డికి షుగర్ లెవెల్స్ 50, శ్రీకాంత్‌రెడ్డికి 70కి పడిపోయినా మొక్కవోని లక్ష్యంతో దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులో మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవడు గొట్టిపాటి భరత్ చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం 5వ రోజుకు చేరింది. భరత్‌తో పాటు దీక్షలో కూర్చున్న పొదిలి రాఘవ, యద్దనపూడి హరిప్రసాద్, భూక్యా రాజానాయక్‌ల ఆరోగ్యం క్షీణించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భరత్‌కు మద్దతుగా బుధవారం పర్చూరులో బంద్ పాటించారు. ఇక కనిగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రాజాల ఆదిరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది.
అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చౌళ్లూరు రామకృష్ణారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మూడవ రోజుకు చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాజమండ్రి నగర కన్వీనర్ గుర్రం గౌతం, మరో ఇద్దరు యువజన నాయకులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, సాల్మన్‌రాజు బుధవారం రాజమండ్రిలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన దళిత నేత గొసుమస్తాన్‌రావు బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నెల్లూరు వేదాయపాళెంలో వైఎస్సార్‌సీపీ రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన నిరసన దీక్షను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ నేత మక్కువ శ్రీధర్ మంగళవారం చేపట్టిన 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష బుధవారం కూడా కొనసాగింది.
నేటి నుంచి ఆకేపాటి, కొరముట్ల ఆమరణదీక్ష
వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటిఅమర్‌నాథ్‌రెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు.