సమైక్య గర్జన | United Andhra Movement in Seemandhra | Sakshi
Sakshi News home page

సమైక్య గర్జన

Published Tue, Aug 13 2013 7:41 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

United Andhra Movement in Seemandhra


 సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఎన్‌జీఓ సంఘాలు సోమవారం సమైక్య ఉద్యమాన్ని హోరెత్తించారు. నేషనల్ హైవేపై వంటా వార్పు నిర్వహించి రాకపోకలను దిగ్బంధించారు. హరనాథపురం సెంటర్‌లో నేతలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో నాలుగు మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. కావలిలో ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. గూడూరులో వైఎస్సార్‌సీపీ నేతలు జేఏసీతో కలిసి దీక్షలు చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి నుంచి 71 విభాగాలకు సంబంధించిన ఎన్‌జీఓలు దాదాపు 50 వేల మంది సమ్మె బాటపట్టారు.  జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉద్యమకారులు వంటా వార్పుతో పాటు ర్యాలీలు, రాస్తారోకోలు, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయడంతో పాటు సమైక్యాంధ్ర  ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఎన్‌జీఓ నాయకులు తేల్చి చెబుతున్నారు.
 
 రాబోయే కాలంలో జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతం కానుంది. నగరంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, ఎన్‌జీఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీఎం కాంపౌండ్ నుంచి మద్రాసు బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మినీబైపాస్ రోడ్డులోని హరనాథపురం సెంటర్‌లో రాస్తారోకో చేసి రాకపోకలను దిగ్బంధించారు. కృష్ణచైతన్య కళాశాల విద్యార్థులు జెడ్పీ నుంచి ఆత్మకూరు బస్టాండు సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కావలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలోని ఆర్టీసీ సెంటర్ నుంచి జెండా చెట్టు వరకు ర్యాలీ నిర్వహించారు. మధ్యలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ సెంటర్‌లో వంటా వార్పు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. కావలికి వచ్చిన లక్ష్మీపార్వతి  జేఏసీ శిబిరంలో కూర్చొని మద్దతు ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సోనియా గాంధీ బ్రిటిష్ పాలకుల్లాగా దేశాన్ని విభజించి పాలించాలని చూస్తుందన్నారు.
 
  రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు ఓట్లు, సీట్లు ప్రాతిపదికగా రాష్ట్ర విభజనకు పూనుకుందని విమర్శించారు. 70 శాతం మంది తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని కోరుకోవడం లేదన్నారు. పొదలకూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హెల్త్ అండ్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. గూడూరులో వైఎస్సార్‌సీపీ, జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేశారు. టవర్ క్లాక్ కూడలిలోని దీక్షా శిబిరంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, మండల కన్వీనర్ మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు కూర్చున్నారు. రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన మార్గంలో కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలులో యూత్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చింతవరం అంబేద్కర్ కూడలి ప్రాంతంలో మానవహారం ఏర్పాటు చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ఆటో కార్మికులు కోట, విద్యానగర్‌ల్లో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కోట గాంధీబొమ్మ సెంటర్ వద్ద కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
 
  ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులు నిరాహార దీక్ష చేశారు. దుత్తలూరు బస్టాండు సెంటర్‌లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వరికుంటపాడు మండలం కొండాయపాళెంలో బస్టాండు సెంటర్‌లో జేఏసీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. వింజమూరు బస్టాండు సెంటర్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు  చేపట్టారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాల విద్యార్థులు సైతం ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. కొడవలూరులో వైఎస్సార్‌సీపీ  మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో అల్లూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై వాలీబాల్ ఆడారు. నార్తురాజుపాళెం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో మోటారు వెహికల్ మెకానిక్‌లు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం, ఆటో కార్మికులు, ఎలక్ట్రికల్ కార్మికులు పట్టణంలోని పాల కేంద్రం వద్ద వాహనాలను అడ్డుకున్నారు. రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.
 
  సూళ్లూరుపేటలో ఏపీ ఎన్జీఓ తాలూకా కార్యదర్శి జనార్దన్ ఆధ్వర్యంలో మండలంలోని మెడికల్ విభాగం సిబ్బంది స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్‌లో మానవహారంతో  నిరసన తెలిపారు. పట్టణంలోని రామలింగ చౌడేశ్వరి మహిళా సేవా సమాజం ప్రతినిధులు, కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌనప్రదర్శన చేశారు. వీరు కూడా మానవహారంలో పాల్గొన్నారు. స్థానిక గోకులకృష్ణా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు స్థానిక హోలీక్రాస్ సెంటర్ నుంచి బజారువీధుల్లో ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌లో మానవహారం నిర్వహించారు. ఆత్మకూరులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వాసిలిలో పాఠశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement