ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌సీపీ సహా పలు పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై కేంద్రం ఎందుకు చర్చను అనుమతించడం లేదు? అవిశ్వాస తీర్మానాలపై అలవోకగా నెగ్గి తమ ప్రభుత్వం పటిష్టమైనదని నిరూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ చర్చకు ఎందుకు వెనుకాడుతున్నది? అసలు చర్చకే భయపడుతుందా?
వివిధ రాజకీయ పార్టీలు తమ తమ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై గొడవ చేయడంతో బుధవారం ఎనిమిదవ రోజున కూడా లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ అవిశ్వాస తీర్మానాలపై ఎలాంటి చర్చను అనుమతించకుండానే సభను సోమవారం నాటికి వాయిదా వేశారు. కేంద్ర బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభమైన మార్చి ఐదవ తేదీ నుంచి లోక్‌సభలో ఇదే తంతు కొనసాగుతోంది. ఏదో పార్టీ ఏదో అంశంపై గొడవ చేయడం, దాంతో సభను వాయిదా వేయడం పరిపాటిగా మారింది.
నీరవ్ మోదీ– పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ గురించి తొలుత కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. చర్చకు పట్టుబట్టింది. ఆ అంశంపై సభలో గొడవ జరుగుతుండగానే వైఎస్‌ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌ను తీసుకొచ్చింది. ఆ డిమాండ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే వరకు వెళ్లింది. తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికి కాపాడుకోవడం కోసం అదే డిమాండ్‌తో సభలో గొడవ చేయడం ప్రారంభించింది.
నీరవ్ మోదీ స్కామ్ అంశంపై చర్చ జరుగకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలబడేందుకే ఈ రెండు పార్టీలు అవిశ్వాస తీర్మానం డ్రామాకు తెరలేపాయని ముందుగా రాజకీయ విశ్లేషకులు భావించారు. ఆ తర్వాత లోక్‌సభ లోపల, వెలుపల ప్రత్యేక హోదా డిమాండ్‌పై వైఎస్‌ఆర్‌సీపీ మరింత కాక పుట్టించడంతో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి తన ఆందోళనను కూడా తీవ్రం చేసింది. పరిస్థితి తీవ్రతను గమనించిన కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాలు కూడా నీరవ్ మోదీ స్కామ్ అంశాన్ని పక్కన పడేసి అవిశ్వాస తీర్మానాలకు అనుకూలంగా కలసి వచ్చాయి. ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలంటే ఇదే సరైన సమయమని ఆ పార్టీలు భావించడమే అందుకు కారణం.
సరిగ్గా ఇక్కడే, ఈ పరిస్థితుల్లోనే సంఖ్యాబలం ఎంతో ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాని భయం పట్టుకుంది. నలువైపుల నుంచి నాలుగైదు పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలపై దాడి చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సభలో ఓపిగ్గా కూర్చోవడం కూడా కష్టం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయక పోయినప్పటికీ పరిస్థితులను ఆసరా చేసుకొని మిత్రపక్షాలు కూడా కేంద్రంపై విమర్శలతో దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది బీజేపీకి మరింత మింగుడుపడని విషయం.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి తప్పుకోగా, మహారాష్ట్ర మిత్రపక్షమైన శివసేన ఇప్పటికే పార్టీతో యుద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తానని కూడా హెచ్చరించింది. మరోపక్క పంజాబ్‌లోని శిరోమణి అకాలీ దళ్ పార్టీ అసంతప్తితో ఉంది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకొని సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని, రైతుల పంటలకు సరైన కనీస మద్దతు ధరను కల్పించాలంటూ అల్టిమేటమ్ జారీ చేసింది. జీఎస్టీ మీద కూడా ఆ పార్టీ ఎంతో గుర్రుగా ఉంది. గురుద్వార్‌లలో ఉచితంగా సరఫరా చేసే భోజనాలపై కూడా జీఎస్టీ పన్ను పడడం అందుకు కారణం.
కేంద్ర మంత్రిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు సడలించడంపై ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై తక్షణమే రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడమే కాకుండా, ప్రధాని స్పందించే వరకు నిరీక్షించకుండా తన పార్టీ తరఫున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
బిహార్‌లోని దళితుల ఓట్లే ఆయన పార్టీకి అండ కనుక బీజేపీ కోసం వారిని ఆయన వదులుకోలేరు. ఇంకోపక్క దేశ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉంది. కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలే కాకుండా మిత్రపక్షాలు కూడా వివిధ కోణాల నుంచి మూకుమ్మడిగా దాడిచేసే అవకాశం ఉంది. దీంతో ఉన్న పరువు కాస్త నట్టేట మునుగుతుందని చర్చ చేపట్టేందుకు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం వణికి పోతోంది.
Comments
Please login to add a commentAdd a comment