రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైల్‌రోకో నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, పార్టీ నాయకులు
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పోరు రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. పార్టీ శ్రేణులన్నీ కంకణబద్ధులై ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఢిల్లీ పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తూ నిరసనను హోరెత్తిస్తున్నాయి. బుధవారం రైలురోకో ద్వారా ఆందోళనను వ్యక్తం చేశాయి. నియోజకవర్గ కేంద్రాలలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నాయి. మండుటెండను సైతం పట్టించుకోకుండా హోదా కోసం పార్టీ నాయకులు..కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.
సాక్షి, తిరుపతి : ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రైలురోకో నిర్వహించారు. రేణిగుంటలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో రెండు రైళ్లను ఆపి నిరసన తెలియజేశారు. ముంబై నుంచి నాగర్‌కర్నూలు వెళ్తున్న బాలాజీ, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. శ్రేణులతో స్థానికులు పాల్గొనటంతో రేణిగుంట రైల్యే స్టేషన్ నినాదాలతో హోరెత్తింది. ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. మహిళలనూ పట్టించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా పోలీసుల సాయం తీసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా వారిని ఈడ్చివేసే సమయంలో కొందరు కిందపడ్డారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వైఎస్సార్‌సీపీ నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, వరదారెడ్డి సిద్దారెడ్డి, ఎస్‌కే బాబు, శెట్టిపల్లి లక్ష్మయ్య, హరిప్రసాద్‌రెడ్డి (రేణిగుంట), తిరుమలరెడ్డి, పుల్లూరు అమరనాథ్‌రెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, రాజేంద్ర, గీతారెడ్డి, పునీతమ్మ, చెలికం కుసుమ, గీత, శారద, పుష్పాచౌదరి, శైలజ, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ నారమల్లి ఆధ్వర్యంలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి నిరసన తెలియజేశారు.
పుత్తూరులో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం సారథ్యంలో చెన్నై–తిరుపతి ప్యాసింజర్ రైలును ఆపి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
కొనసాగుతున్న రిలే దీక్షలు
జిల్లాలో బుధవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రిలేదీక్షలు చేపట్టారు, రోడ్డుపై అర్ధనగ్నంగా మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేశారు. నగ రి, తిరుపతి, చంద్రగిరి, పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లి, పూతలపట్టు, పీలేరు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రిలే‡దీక్షలు నిర్వహించారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంటలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు రిలే నిరాహారదీక్షలు చేశారు. ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులు అర్ధనగ్నంగా పేపర్లు కప్పుకుని నిరసన తెలియజేశారు.
ఇదేనా సీఎంకు హోదాపై శ్రద్ధ
ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ వైఖరి స్పష్టంగా తెలుస్తోంది. మా పార్టీ నేతలు నిరసన తెలియజేస్తుంటే సీఎం ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచివేస్తున్నారు. కనీసం మహిళలని కూడా చూడకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. ఉద్యమకారులకు అండగా ఉండాల్సిన సీఎం పోలీసుల చేత బలవంతంగా ఈడ్చివేయించారు. గతంలో కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడితే మాపై సీఎం కేసులు బనాయించారు. ఈ రోజు కూడా అదే తరహాలో సీఎం వ్యవహరిస్తున్నారు. నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్నీ రాజకీయంగా అనుకూలంగా మలచుకునే వ్యక్తి. ప్రత్యేక హోదా కోసం పోరాడే హీరో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడే.
–విలేకరులతో భూమన కరుణాకరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment