రేపు వైఎస్సార్ సీపీ ధర్నా
♦ సర్కారు వైఫల్యాలపై గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన
♦ రైతుకు మద్దతుగా ఆందోళన
♦ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలి
♦ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేర కు గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్‌లు, ఆయా విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థత, ఖరీఫ్ తరుణంలో రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడం, కేంద్రంలో వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచడంలో కృషి చేయలేకపోవడం, ఎరువులు, విత్తనాలు సరఫరా చేయలేకపోవడం, రుణాలు సకాలంలో అందకపోవడం వంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు మర్రి రాజశేఖర్ తెలిపారు.
ప్రస్తుత కాలంలో రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతుల సమస్యలను పక్కన పెట్టి ‘ఓటుకు కోట్లు’ కేసులో మునిగిపోయారని, పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు అందజే సేందుకు దృష్టి సారించకపోవడం సిగ్గుచేటన్నారు.
గత సంవత్సరం పండించిన పంట అమ్ముడుపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం గురించి మాట్లాడకుండా తక్కిన పనికిరాని విషయాలన్నీ చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి ఓట్లు వేసిన రైతులకు వెన్నుపోట్లు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుదన్నారు. రైతుల సమస్యల కోసం చేపడుతున్న ధర్నా కార్యక్రమంలో పార్టీలోని ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని కోరారు.
విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పీఆర్కే పిలుపు
మాచర్లటౌన్ : వైఎస్సార్ సీపీ చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, తెలుగుదేశం ప్రభుత్వం కాలం వెళ్లదీస్తూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.