పుష్కర పనుల్లో దోపిడీ | exploitation in Pushkarni work | Sakshi
Sakshi News home page

పుష్కర పనుల్లో దోపిడీ

Published Wed, Jul 20 2016 8:17 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

exploitation in Pushkarni work

పుష్కర పనులు నాసిరకంగా సాగుతున్నాయని, అధికార పార్టీ నేతల దోపిడీకి మారుపేరుగా నిలుస్తున్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో ధరణికోట, అమరావతి, సీతానగరంలో ఘాట్లను పార్టీ నాయకులు అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమస్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, క్రిస్టినా, బొల్లా బ్రహ్మనాయుడు, రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్‌లతో కలిసి వారు పరిశీలించారు.

 

ఘాట్లలో జరుగుతన్న పనుల తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పనుల్లో సాంకేతికపరమైన అంశాలు,నాణ్యతపై ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నలవర్షం కురిపిస్తుంటే.. అధికారులు నీళ్లు నమిలారు. ధరణికోటలో 350 మీటర్ల మేర ఘాట్ పనులు దాదాపు రూ. 10 కోట్లతో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకు కేవలం 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. 0.4 మీటర్ల మందంతో కాంక్రీట్ వేయాల్సిఉండగా.. కనీసం 0.2 మీటర్ల మందం కూడా వేయడం లేదని, ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ జరుగుతున్న పనులేనన్నారు. కాంక్రీట్‌కు ముందు ఇసుక వేసి చదును చేసేటప్పుడు పిన్ వైబ్రేటర్ వాడాలి. కాంక్రీట్ వేసేటప్పుడు ప్యాన్ వైబ్రేటర్ ఉపయోగించాలి. అవేమీ ఇక్కడ కనిపించలేదన్నారు. బెడ్‌కు వాడే కాంక్రీట్‌కు 40 ఎంఎం కంకర బదులు అన్‌సైజు 3/4 కంకర వాడుతున్నారని పేర్కొన్నారు. అక్కడ నదిలో ఉన్న ఇసుకను వినియోగిస్తూ.. క్యూబిక్ మీటరుకు రూ. 250 వంతున దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. పనుల్లో వాడుతున్న స్టీల్‌కు టెస్టింగ్ సర్టిఫికెట్లు అడిగితే చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్టింగ్ క్యూబ్ గురించి అధికారులు మాట్లాడటం లేదని పేర్కొన్నారు. పుష్కరాల తేదీలు ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. జూన్ 10న పనులు ప్రారంభించి హడావుడి చేయడమేమిటని వారు ప్రశ్నించారు. గడువు మేరకు ఈ నెలాఖరుకు పనులు కాకపోతే కాంట్రాక్టర్లకు రేట్లు పెంచే కుట్ర జరుగుతుందన్నారు.


జేబులు నింపుకోవడానికే..
పుష్కర పనులను సైతం సీఎం చంద్రబాబునాయుడు, చినబాబు , స్థానిక అధికార పార్టీ నేతలు వదలటం లేదన్నారు. పనులు నాసిరకంగా చేసి వాటాలు పంచుకొంటున్నారని ఆరోపించారు. పనులు జరుగుతున్న తీరు చూస్తే భక్తుల కోసమా, జేబులు నింపుకోవటానికా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత పాటించలేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికే అవినీతికి సంబంధించి ఏపీ అగ్రస్థానంలో ఉందని జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. నంబరు 1 సీఎం అని గొప్పలు చెప్పుకొనే బాబు అవినీతి పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement