నేటి నుంచి వైఎస్‌ఆర్ సీపీ దీక్షలు
Published Wed, Oct 2 2013 2:11 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
బొబ్బిలి, న్యూస్‌లైన్: భారతావనికి ఆంగ్లేయుల దాస్యశృంఖలాల నుంచి స్వేచ్ఛ కల్పించేం దుకు అహింసే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిన గాంధీజీ స్ఫూర్తితో సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు వైఎస్‌ఆర్ సీపీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా జిల్లాలో పోరాట కార్యక్రమాలకు మంగళవారం శ్రీకారం చుట్టనుంది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.
సమన్వయకర్తలకు మద్దతుగా వందల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రిలేదీక్షల్లో కూర్చోనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు రిలే దీక్షలు చేస్తుండగా, నిరవధిక దీక్షలతో నిరసన కార్యక్రమాలు మరింత ఉద్ధృతం కానున్నాయి. నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళతారు. నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు ఎంత మంది ఉంటే అంత మందీ ఒకే దగ్గర శిబిరాలు వేసుకొని దీక్షలు చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. వీరికి సంఘీభావంగా ఆయా నియోజకవర్గ పరిధిలో ఉండే మండలం, పట్టణాల్లో నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో పాల్గోనున్నారు.
పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి పాత పెట్రోలు బంకు ఆవరణలో నిరాహార దీక్ష చేయనున్నారు. అలాగే పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో దీక్షకు కూర్చోనున్నారు. ఆయనతో పాటు జిల్లా రైతు కన్వీనర్ దంతులూరి శంకర సీతారామరాజు, కాకర్లపూడి శ్రీనివాసరాజుతో పాటు మండల కన్వీనర్లు, బొబ్బిలిలో సుజయ్‌కృష్ణరంగారావుతో పాటు అరకు పార్లమెంట్ నియోజవర్గ పరిశీలకుడు బేబీనాయన, పలువురు మాజీ జెడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీపీలు, పీఏసీఎస్ అధ్యక్షుడు మరడ వేణుగోపాలనాయుడు తదితరులు, సాలూరులో నియోజకవర్గ సమన్వయకర్తలు గరుడపల్లి ప్రశాంతకుమార్, రాయపల్లి సుందరరావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ముగడ గంగమ్మ, నాయకులు గొర్లె మధుసూదనరావు, జరజాపు సూరిబాబు తదితరులు, విజయన గరంలో సమన్వయకర్త అవనాపు విజయ్, కురుపాం నియోజకవర్గంలో పెద్ద మేరంగిలో సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి శకుంతలమ్మ వీరితో పాటు మండల కన్వీనర్లు దీక్షలో పాల్గోనున్నారు.
ఎస్.కోటలో బోకం శ్రీనివాసరావు, వేచలపు చినరామునాయుడు, గేదెల తిరుపతితో పాటు పలువురు కార్యకర్తలు, పార్వతీపురం పట్టణంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్తలు జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను, కొయ్యూన శ్రీవాణి, జెడ్పీ మాజీ చైర్మన్ గులిపల్లి సుదర్శనరావులతో పార్టీ నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మజ్జి వెంకటేష్, ఆర్‌వీఎస్ కుమార్, చీపురుపల్లిలో నియోజకవర్గ కన్వీనర్ శనపతి సిమ్మినాయుడు, మండల కన్వీనర్ మీసాల అప్పలనాయుడు, గరివిడి మండల కన్వీనర్ సీహెచ్ సత్యనారాయణ రెడ్డి, మెరకముడిదాం మండల కన్వీనర్ పల్లి బంగారునాయుడు, గజపతినగరంలో నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, నాయకులు ఎస్.పెద్దినాయుడు, మక్కువ శీధర్, మండల కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గోనున్నారు.
నిరసన మాసం..
నిరవధిక దీక్షలతో మొదలయ్యే పోరాటం వివిధ రకాల నిరసన కార్యక్రమాలతో నెల రోజులపాటు కొనసాగుతుంది. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని నాయకులు చెప్పారు. 7న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల నివాసాల ఎదుట శాంతియుతంగా ధర్నాలు చేసి రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెస్తారు. 10న మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలు, 17న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు, 21న మహిళలతో ర్యాలీ, మానవహారం, 24న నియోజకవర్గ కేంద్రాల్లో యువకుల బైక్ ర్యాలీ, 26న జిల్లా కేంద్రాల్లో పార్టీ సర్పంచులు, సర్పంచులుగా పోటీ చేసేవారు ఒక రోజు దీక్ష, 29న నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుత ఆందోళనలు నిర్వహించడానికి పార్టీ నాయకులు సమాయత్తమవుతున్నారు.
Advertisement
Advertisement