దూసిన కత్తి
Published Mon, Oct 7 2013 4:47 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, ఏలూరు : రాష్ట్ర విభజన నిర్ణయంపై వెల్లువెత్తుతున్న నిరసనలు శక్తి రూపం దాల్చాయి. వేర్పాటువాదులపై ఉద్యమ కత్తిని దూస్తున్నాయి. ‘పశ్చిమ’ ప్రజలంతా విభజనను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం పోరుబాటలో నడుస్తున్నారు. తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయటాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల బంద్ జిల్లాలో సంపూర్ణమైంది. మూడవ రోజైన ఆదివారం నాడు జిల్లావ్యాప్తంగా బంద్ పాటించారు. వైసీపీ శ్రేణులు ఎక్కడిక్కడ ఆందోళనలు చేపట్టారు. ప్రజాప్రతినిధులను సోనియూగాంధీ గంగిరెద్దుల్లా ఆడిస్తోందని ప్రజలంతా దుమ్మెత్తిపోశారు.
సోనియా, కేంద్ర మంత్రుల చిత్రపటాలకు పిండ ప్రదానాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తామంటూ సింహనాదం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు బైక్‌లపై తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. జాతీయ రహదారిని దిగ్బంధించి అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీ సీఈసీ సభ్యుడు పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నరసాపురంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావలి నాని ఆధ్వర్యంలో ర్యాలీ జరిపి బంద్ చేశారు. బస్టాండ్ సెంటర్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వీరవాసరంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, జాతీయ రహదారిపై టెంట్‌లు వేసి వాహనాలను నిలిపివేశాయి. నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని దుకాణాలను మూయించివేశారు. మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన దీక్షకు సంఘీభావంగా దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్తలు చలుమోలు అశోక్‌గౌడ్, కొఠారు రామచంద్రరావు, పీవీ రావు గోపన్నపాలెం, మసీదుపాడు, వేగవరం గ్రామాల్లో ట్రాక్టర్ల ర్యాలీ జరిపారు. పాలకొల్లులో సంపూర్ణ బంద్ జరిగింది. పట్టణంలోని అన్ని దుకాణాలు మూయించివేశారు.
ఆచంటలో కేంద్ర మంత్రుల చిత్రపటాలకు పిండ ప్రదానం, సోనియా దిష్టిబొమ్మల దహనం చేశారు. ఈ కార్యక్రమాలలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. తణుకులో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వ ర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఆటోలు సైతం నిలిచిపోయాయి. నరేంద్ర సెంటర్‌లో సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, ఎంఎం పళ్లంరాజు బొమ్మలకు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేసి నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధం చేశారు. ప్రజాప్రతినిధులను సోనియాగాంధీ గంగిరెద్దుల్లా ఆడిస్తున్నారంటూ పోలీస్ ఐలండ్ సెంటర్‌లో గంగిరెద్దులతో విన్యాసాలు ఏర్పాటు చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో బంద్, రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలు జరిగాయి. దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల, గోపాలపురం మండల కేంద్రాలలో వైసీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు పాల్గొన్నారు.
కొనసాగుతున్న దీక్షలు
తెలంగాణ నోట్‌ను ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షా శిబిరాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నారుు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా పెనుగొండ గాంధీ చౌక్‌లో ఆదివారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ మండల కన్వీనర్ యాదాల రవిచంద్ర, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పిల్లి సత్తిరాజు పాల్గొనగా, నియోజకవర్గ సమన్వయకర్తలు మల్లుల లక్ష్మీనారాయణ, కండిబోయిన శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. మార్టేరులో వైఎస్ జగన్‌కు మద్దతుగా దీక్షలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిగూడెంలో జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా పార్టీ అభిమానులు రిలే దీక్షలలో కూర్చున్నారు. ఏలూరులో వైసీపీ చేపట్టిన దీక్షల్లో వెంకటాపురం గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలులో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నౌడు వెంకటరమణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తణుకులో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 5వ రోజుకు చేరాయి.
ఆరవల్లి సర్పంచ్ నీతిపూడి మరి యమ్మ, మరో 12మంది నిరాహార దీక్ష చేపట్టారు. నిడదవోలులో దీక్షలు కొనసాగుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాగితాల రామారావు చేపట్టిన ఆమరణ దీక్ష రెండవ రోజుకు చేరింది. పాలకొల్లు కెనాల్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. పోడూరు మండల పార్టీ కార్యకర్తలు పాల్గొనగా, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకటసత్యనారాయణ సంఘీభావం తెలిపారు. భీమవరంలో వైఎస్సార్ సీపీ రిలే దీక్షా శిబిరంలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. వీరవాసరంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉండి సెంటర్లో దీక్షలు మూడో రోజూ కొనసాగించారు. పాలకోడేరులో దీక్ష చేపట్టిన వారికి పార్టీ సీఈసీ సభ్యుడు పాతపాటి సర్రాజు సంఘీభావం తెలిపారు. నరసాపురం బస్టాండ్ సెంటర్‌లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement