సాక్షి, హైదరాబాద్: జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందన్న వార్తతో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయ ప్రాంగణం జగన్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. జగన్ నివాసం లోటస్‌పాండ్ వద్దా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ‘‘వైఎస్సార్.. అమర్ హై! జై...జగన్...’ అన్న నినాదాలు మార్మోగాయి. కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతూ సంతోషాన్ని వ్యక్తంచేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకుంటూ రంగుల్లో మునిగి తేలారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పార్టీ కార్యాలయం పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
బెయిల్ వచ్చిందనే వార్తతో పార్టీ ప్రముఖులు లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి తరలి వచ్చారు. కార్యకర్తలు పార్టీ గౌరవాధ్యక్షులు విజయమ్మ, జగన్ సతీమణి భారతి, సోదరి షర్మిలకు అభినందనలు చెప్పేందుకు ఎగబడ్డారు. మణికొండలోని పంచవటి కాలనీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద కూడా అభిమానులు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. జగన్ మంగళవారం జైలు నుంచి బయటకు వస్తుండడంతో వివిధ జిల్లాల నుంచి ముఖ్యులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
పార్టీ కార్యాలయం వద్ద సందడే సందడి
Published Tue, Sep 24 2013 3:56 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement