వైఎస్సార్ గంగాహారతి ఏర్పాట్లను పరిశీలిస్తున్న శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య తదితరులు
ఆత్మకూరు/ రూరల్ : ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద మంగళవారం ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తయ్యింది. దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సహకారాన్ని స్మరించుకుంటూ వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఆత్మకూరులోనే మకాం వేసి.. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అలాగే సోమవారం పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పార్టీ నాయకులు శిల్పా కార్తీక్‌రెడ్డి, రవిచంద్ర కిశోర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి తదితరులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
భారీగా ఏర్పాట్లు
మండు వేసవి కావడంతో గంగాహారతిలో పాల్గొనేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిద్ధాపురం చెరువు వద్ద సభాస్థలిని సిద్ధం చేశారు. సుమారు 20వేల మంది కూర్చునేందుకు వీలుగా విశాలమైన చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా ఘనంగానే ఉన్నాయి. సుమారు 30 కౌంటర్లను సిద్ధం చేశారు. సోమవారం రాత్రి నుంచే వంటలు చేయడం ప్రారంభించారు. 50 వేల నీటి ప్యాకెట్లు, 30 వేల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. చెరువులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బోట్లను ఏర్పాటు చేస్తున్నారు.
గంగమ్మకు బోనాలెత్తనున్న 1,200 మంది మహిళలు
వైఎస్‌ఆర్ గంగాహారతి కార్యక్రమంలో బోనాలను ఎత్తడానికి సుమారు 1,200 మంది మహిళలు ఇప్పటికే నిర్వాహకుల వద్ద నమోదు చేసుకున్నారు. సంజీవ్ నగర్ తండా నుంచి మహిళలు బోనాలను తీసుకుని ఊరేగింపుగా సిద్ధాపురం చెరువు వైపు సాగుతారు. నేరుగా కట్టమీదకు వెళ్లిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహం వద్ద బోనాలను సమర్పిస్తారు. అలాగే యాగంలో పాల్గొని దీపాలను చెరువులో వదలనున్నారు.
ప్రముఖ నాయకుల రాక
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్‌సీపీ ప్రముఖ నాయకులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఎంఎల్‌సీలు, ఎంపీలు కూడా హాజరుకానున్నారు.
కార్యక్రమం సాగుతుందిలా...
- ఉదయం 9.30 గంటలకు జలాశయం సమీపంలోని సంజీవనగర తండా నుంచి మహిళలు బోనాలు తీసుకుని ఊరేగింపుగా చెరువు కట్టపైకి సాగుతారు.
- 10.45 గంటలకల్లా గంగమ్మకు బోనాలు సమర్పిస్తారు. ఆతరువాత చెరువు గర్భం ర్యాంప్‌పై ఏర్పాటు చేసిన యాగశాలలో యాగం జరుగుతుంది. గంగమ్మకు దీపాల సమర్పణ జరుగుతుంది.
- 11 గంటలకు చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సభాస్థలిలో బహిరంగ సభ ప్రారంభమవుతుంది.
- మధ్యాహ్నం 1,00 గంటకు భోజన కార్యక్రమం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment