అభివృద్ధికి చిరునామా వైఎస్సార్
జయంతి వేడుకలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి
పట్నంబజారు(గుంటూరు) : అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరునామాగా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. మహానేత వైఎస్సార్ 66వ జయంతిని పురస్కరించుకుని బుధవారం గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను నేతలు కట్ చేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలు చరిత్ర పుటల్లో నిలిచిపోయాయన్నారు.
రాష్ట్రం లో ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ఉన్నాననే ధైర్యం కల్పించిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ బతికి ఉంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండేవే కాదన్నారు. రైతుల ఆత్మహత్యలు లేకుండా, మహిళల కన్నీరు తుడిచిన మహ నీయుడని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గుండె మహానేత పాలన కావాలని కోరుకుంటోందని చెప్పారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో యువతకు పెద్దపీట వేశారన్నారు.
లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ పేద వర్గాలకు బాసటగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్ అని కొనియాడారు. సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద మహిళను లక్షాధికారిగా చూడాలని ఆశపడిన మహనీయుడని చెప్పారు. బీసీ, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు కోవూరి సునీల్, బండారు సాయిబాబు మాట్లాడుతూ దళిత, బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు పంచిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పలు విభాగాల నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, అత్తోట జోసఫ్. ఎం దేవరాజు, కోటా పిచ్చిరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి, పెదాల బాబు, సుంకర రామాంజనేయులు, మేళం ఆనందభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.