సాక్షి, విజయనగరం: రైతుల కోసం వైఎస్సార్ ఒకడుగు ముందుకు వేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రిని మించి రైతులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం చీపురుపల్లి పరిధిలోని గుర్లలో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 28వేల మంది రైతులకు రూ.34 కోట్ల పెట్టుబడి సాయం చెక్కులను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు నలుగురికి అన్నం పెట్టేవాడిగా వుండాలని కోరుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. గతంలో వైఎస్సార్ రైతులకోసం ప్రవేశపెట్టిన పథకాలే ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు సాయం చేసే కార్యక్రమాలనే మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ కంటే అధికంగా రైతులకు సహాయం అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కి దక్కిందని ప్రశంసించారు. ఎన్నికల సమయంలో రైతులకు ప్రతి ఏటా రూ.12,500 పెట్టుబడి సహాయం చేస్తామని హామీ ఇచ్చాము. కానీ ఇప్పుడు ఆ మొత్తానికి రూ. వేయి పెంచుతూ రూ.13,500 చేశామని తెలిపారు. అదేవిధంగా నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లపాటు రైతుభరోసా సహాయం అందించాలని నిర్ణయించామని వెల్లడించారు.
నవంబరు 15వ తేదీ వరకు ఈ పథకంలో రైతులు పేర్లు నమోదు చేసే అవకాశం వుందని.. రైతులు తమ పేర్లు నమోదు కాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆధార్ వివరాలు తప్పుగా నమోదైనా సరి చేస్తామన్నారు. ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నదే సీఎం జగన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా సమస్యలు వస్తే వాటిని సరిచేసి పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల పంటలకు మద్ధతు, గిట్టుబాటు ధరలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు. రైతులు పండించే పంటలకు .. వారు పంట వేసినప్పుడే మద్ధతు ధర ప్రకటించి భరోసా కల్పిస్తామన్నారు. పంటలు పండించే రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో గిట్టుబాటు ధరలకు.. మార్కెట్ కమిటీల ద్వారా పంటలు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పండించే ఇరవై పంటలకు ప్రభుత్వం మద్ధతు ధరలు ప్రకటించిందని.. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందాలని మంత్రి బొత్స పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment