సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యాసంస్థల యాజమాన్యం స్పందించింది. జిల్లా వ్యాప్తం గా పలుప్రాంతాల్లో ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేసి ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించా రు. అదే విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి నిరసనలు తెలియజేశారు. బంద్‌తో కలెక్టర్, జెడ్పీ కార్యాలయాలు బోసిపోయి కనిపించాయి. ఆర్టీసీ బస్సులు బస్టాండ్లకే పరిమితమయ్యాయి. ఫలితంగా శుక్రవారం ఆర్టీసీకి రూ.30 లక్షలు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పరిరక్షణ వేదిక, సమైక్యరాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ, విద్యార్థి జేఏసీ నాయకులు కూడా బంద్‌లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణు లు నగరంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కల్లూరు పరిధిలో పార్టీ నాయకులు పెరుగు పురుషోత్తంరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, ప్రభుత్వ కార్యాలయాలను మూయించి బంద్‌కు సహకరించాలని కోరారు. నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పద్మావతినగర్ నుంచి మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. పట్టణమంతా బైక్‌లపై తిరుగుతూ బ్యాంక్‌లను, షాపులను, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. టీ బిల్లు చర్చను నిరసిస్తూ స్థానిక సమతా హిజ్రాల సంఘం ఆధ్వర్యంలో నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆటపాటతో నిరసనను తెలియజేశారు.
అళ్లగడ్డ పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలను ముసి వేయించి మోటర్ సైకిల్ ర్యాలి చేశారు, నాల్గురోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పత్తికొండలో నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి పట్టణంలో పర్యటించి బంద్ విజయవంతం చేశారు.
బంద్‌కు జనం మద్దతు...
ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తెల్లవారుజామున ఐదుగంటలకే రోడ్లపైకి వచ్చి వాహనాలను నిలిపివేశారు. ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సునుకూడా బయటకు రాకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. షాపులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంక్‌లు స్వచ్ఛందంగా మూసివేశారు. అదే విధంగా విద్యాసంస్థల యాజమాన్యం బంద్‌కు సహకరించింది. బనగానపల్లెలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ఎర్రబోతుల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కాటసాని ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ పాటించారు. కోవెలకుంట్లలో ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎమ్మిగనూరులో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా పాల్గొంది.
ఎమ్మెల్యే తనయుడు, కేడీసీసీ బ్యాంక్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, జేఏసీ చెర్మైన్ ఈశ్వరయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ బీవీ.జయనాగేశ్వర్‌రెడ్డిల నేతృత్వంలో పట్టణంలో మోటర్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఆదోని పట్టణంలో బంద్‌కు సంపూర్ణమైంది. మంత్రాలయం, ఆలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కన్వీనర్లు బంద్ నిర్వహించారు. నందికొట్కూరులో ఐజయ్య, బండి జయరాజ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. పటేల్‌సెంటర్‌లో బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని బంద్ చేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
బంద్ ప్రశాంతం
Published Sat, Jan 4 2014 2:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement