sv mohanreddy
-
ఎస్వీ మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నంద్యాల: వైఎస్ఆర్ సీపీ టికెట్ మీద గెలిచి పచ్చ కండువా కప్పుకున్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నంద్యాలలో ఇటీవల టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరైన కార్యక్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలకు పదవుల పంట పండిందని, సర్కార్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని.. ఇది చూసి పక్క నియోజక వర్గాల ప్రజలు తమ ఎమ్మెల్యే కూడా పోతే బాగుండని అనుకుంటున్నారని చెప్పారు. ఆ సమయంలో వేదిక మీద మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ఉండటం గమనార్హం. ఇటీవల మృతిచెందిన భూమా నాగిరెడ్డి ఆయనకు భావ అన్న విషయం తెలిసిందే. అయినా ఎమ్మెల్యే ఎక్కడా తగ్గకుండా ఏపీలో వాస్తవ పరిస్థితిపై మాట్లాడటంతో టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాతే ఆయన కూతురు అఖిలప్రియకు చంద్రబాబు తన కేబినెట్లో చోటిచ్చిన విషయాన్ని మోహన్ రెడ్డి గుర్తుచేయడంపై టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. గత మూడేళ్లలో నంద్యాలను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ ఉప ఎన్నికలు రాగానే కాపు కల్యాణ మండపం, రోడ్లు వేయిస్తాం అంటూ కేవలం 10 రోజుల్లోనే రూ.300 కోట్ల మేర అభివృద్ధి పథకాలను సర్కార్ ప్రకటించిన విషయం విదితమే. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతేనే సీఎం చంద్రబాబు నాయుడు ఆ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు వస్తాయి, కనుక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. కేవలం ఎమ్మెల్యేలు పోతే బై ఎలెక్షన్లు వస్తే బాగుండని ప్రజలు భావిస్తున్నారని, ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలే అందుకు నిదర్శనమన్నారు. భూమా నాగిరెడ్డి బతికున్నంతకాలం వరకు ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోని సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం నంద్యాలకు ఉప ఎన్నికల తరుణంలో స్థానిక నేతలకు పదవులు ఆశ చూపుతున్నారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లలో నంద్యాలలో మూడు ఇళ్లు కూడా కట్టించని ప్రభుత్వం, ఉప ఎన్నికలున్నందున పదమూడు వేల ఇళ్లు కట్టిస్తామని సర్కార్ ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయి ఉప ఎన్నిక వస్తేనే సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
డిగ్రీలో సీఈసీ చదివాను!
► ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటర్వ్యూ వీడియో వైరల్ కర్నూలు: డిగ్రీలో సీఈసీ చదివానంటూ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరువక ముందే.. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిగ్రీలో సీఈసీ చదివానని చెప్పడం హాస్యాస్పదమైంది. ఓ చానెల్‌కు ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. దానికి సంబంధించి పోస్ట్ చేసిన ప్రొమో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంటర్లో ఏ కోర్సు చేశారు అన్న ప్రశ్నకు.. ‘‘ఇంటర్లో మామూలుగా సివిక్స్, సివిల్.. మామూలుగా జనరల్. అప్పుడు ఎంపీటీసీలు, ఎంపీసీలు ఇవన్నీలేవు. జనరల్‌గా ఉండేది ఇంటర్మీడియట్. అప్పుడు ఇంటర్లో సీఈసీ లేదు. నేను డిగ్రీకి వచ్చాక సీఈసీ చేశాను’’ అని మోహన్‌రెడ్డి జవాబిచ్చారు. దీంతో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి డిగ్రీలో సీఈసీ ఉండదనడంతోనే.. ఎస్వీ మోహన్‌రెడ్డికి చెమటలు పట్టి టవల్‌తో తుడుచుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంటర్, డిగ్రీలో ఏ సబ్జెక్టులుంటాయో తెలియని వ్యక్తులు మనకు నాయకులయ్యారా! అని చర్చించుకుంటున్నారు. -
ఎస్వీ మోహన్‌రెడ్డిని అనర్హుడుగా చేయాలి
స్పీకర్‌కు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం వినతి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీలో చేరిన ఎస్వీ మోహన్‌రెడ్డిని శాసన సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు విజ్ఞప్తి చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు కళత్తూరు నారాయణస్వామి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ఏపీ శాసనసభ డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యను గురువారం సాయంత్రం 5.15 గంటలకు కలసి ఈ మేరకు ఒక ఫిర్యాదును సమర్పించారు. స్పీకర్, శాసనసభ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో వారీ ఫిర్యాదును డిప్యూటీ కార్యదర్శికి అందజేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎస్వీ మోహన్‌రెడ్డి శాసనసభ్యునిగా కొనసాగే అర్హతను కోల్పోయారని, తక్షణం ఈ అంశంపై నిర్ణయం వెల్లడించాలని వారు కోరారు. ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాను కప్పుకోవడంతోపాటు పార్టీని వీడుతున్నట్లు చేసిన వ్యాఖ్యలను ఈ ఫిర్యాదు ద్వారా స్పీకర్ దృష్టికి తెచ్చారు. -
ఎస్వీ మోహన్‌రెడ్డిపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శికి గురువారం ఫిర్యాదు చేశారు. తక్షణమే మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేయాలని కోరారు. డిప్యూటీ కార్యదర్శిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. -
'బీజేపీ, టీడీపీ కలిసి మైనార్టీలను తొక్కేస్తున్నాయి'
హైదరాబాద్: ఏపీలో ముస్లిం మైనార్టీలు అంటేనే ప్రభుత్వానికి చాలా చులకనగా ఉందని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. కేవలం ముస్లిం మైనార్టీలనే కాదు.. క్రిస్టియన్, ఇతర మైనార్టీ వర్గాలపైనా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. మైనార్టీల గురించి కేవలం ఒక్క ప్రశ్న వేయడానికి మాత్రమే అవకాశం ఇచ్చారని, ఏపీ ప్రభుత్వానికి ఓ కవచంలా స్పీకర్ కోడెల శివప్రసాదరావు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ 15 పాయింట్ల పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. దీనిపై కనీసం కమిటి వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, ఎస్సీలకు ఉన్నట్లుగానే మైనార్టీలకు ఓ సెల్, కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ, టీడీపీలు కలిసి మైనార్టీల గొంతు నొక్కుతున్నాయని ఆయన మండిపడ్డారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల బాధను పట్టించుకోవడం లేదని అందుకే వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ పై అవిశ్వాసం పెట్టారని ఆ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా అభిప్రాయపడ్డారు. మైనార్టీలు అనగానే మాట్లాడటానికి కేవలం రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి గానూ జరిపిన కేటాయింపులలో కేవలం 60 శాంతం ఖర్చుచేసినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు కేటాయించినా, కేవలం 203కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుచేసిందని విమర్శించారు. మైనార్టీ విద్యార్థులకు రూ.60 కోట్లు కేటాయించగా, రూ.20కోట్లు ఖర్చుచేశారని చెప్పారు. ముస్లిం మైనారిటీ స్కూళ్లకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు. వైఎస్ఆర్ సీపీ జిల్లాలో ముస్లింల కోసం రూ. 5.5 కోట్లు కేటాయంపులు చెసినా రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగతా జిల్లాల్లో పరిస్థతి ఇంకా ఎంత దారుణంగా ఉందని పేర్కొన్నారు. మైనార్టీ నిరుద్యోగులకు వడ్డీ లేకుండా 5 లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పి పాటించలేదని వ్యాఖ్యానించారు. మహిళలకు స్వయం సహాయక గ్రూపులు ఏర్పరచి ఒక్కొక్కరకి రూ.5 వేలు ఇస్తామన్నా ఏ చర్యల తీసుకోలేదు మైనార్టీ మహిళల వివాహం కోసం రూ. 50 వేలు ఇప్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు కానీ అమలు చేయలేదు. -
'భూమా ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం'
కర్నూలు: పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆయనకు ఏదైనా జరిగితే జిల్లా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. భూమాపై అక్రమ కేసుల నమోదు, అరెస్టు, జైలుకు తరలింపు నేపథ్యంలో కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరిత, మణిగాంధీ, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డిలు మాట్లాడారు. భూమా నాగిరెడ్డికి ఇప్పటికే గుండె శస్త్రచికిత్స జరిగిందని.. బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారన్నారు. అయినప్పటికీ పోలీసులు నిమ్స్‌కు తరలించేందుకు సెక్యూరిటీ ఇవ్వలేమంటూ అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించారు. మహిళా శాసనసభ్యురాలు అని కూడా చూడకుండా భూమా అఖిలప్రియతో పోలీసులు నువ్వు అని సంబోధిస్తూ అమర్యాదగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్‌తో పోలీసులు ప్రవర్తించిన తీరు, మహిళా ఎమ్మెల్యేతో వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కూడా ప్రవేశపెడతామన్నారు. -
భావి తరాలకు మార్గదర్శి మోక్షగుండం
ఘనంగా ఇంజనీర్స్ డే కల్లూరు రూరల్: దేశంలోని భావి ఇంజనీర్లకు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకులని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. దూపాడులోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్‌డేను పురస్కరించుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ విజయలక్ష్మమ్మ, ప్రిన్సిపాల్ తిమ్మయ్య పాల్గొన్నారు. శాలువలు వద్దూ..దుప్పట్లు కావాలి..: ఇంజనీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ రవికృష్ణను కళాశాల యాజమాన్యం శాలువతో సన్మానించారు. అయితే ఆయన తనకు శాలువలు వద్దని, విధి నిర్వహణలో భాగంగా రాత్రి వేళ గస్తీ తిరుగుతుండగా చాలా మంది పేదలు కప్పుకునేందుకు దుప్పట్లు లేక చలికి వణుకుతున్నారన్నారు. అలాంటి వాళ్ల కోసం దుప్పట్లు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ సూచించడంతో కేవీ సుబ్బారెడ్డి 500 దుప్పట్లు గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో..: నగర శివారులోని శ్రీని వాస ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీనివాస రావు మోక్షగుండం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ డిప్యూటీ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ కే.నాగరాజు హజరయ్యారు. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ కర్నూలు(అర్బన్): విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని జేఎన్టీయు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని విశ్వేశ్వరయ్య సర్కిల్లో కర్నూలు జిల్లా టెక్నికల్ ఫోరం ఆధ్వర్యంలో 47వ ఇంజనీర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ శ్రీనివాసరెడ్డి, పీ నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హేమచంద్రారెడ్డి ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రోడ్లు,భవనాలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఎస్ఎస్ఏ, ఏపీఎస్ఐడీసీ, హౌసింగ్, ఇరిగేషన్ తదితర విభాగాలకు చెందిన ఇంజనీర్లు విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డెరైక్టర్ జయరామిరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ నాగేశ్వరరావు,ఆర్అండ్బీ ఈఈ ఉమామహేశ్వర్, డీఈఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ ఫణిరామ్, హెచ్డీ ప్రసాదరెడ్డి, ఎస్ఎస్ఏ డీఈఈ కేవీకేవీ ప్రసాద్‌తో పాటు పలువురు రిటైర్డు ఇంజనీర్లు పాల్గొన్నారు. -
రాజధానిగా కర్నూలు లేనట్లే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీమ ముఖద్వారం కర్నూలు రాజధాని అయ్యే కల నెరవేరేలా కనిపించడం లేదు. ఆ మాటెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తపడినట్లు తెలిసింది. గురువారం కర్నూలుకు వచ్చిన సీఎంను రాజధాని సాధన కమిటీ నాయకులు కలిశారు. ‘ప్రతి జిల్లా వారు రాజధాని కావాలంటున్నారు. అన్ని జిల్లాలకు ఇవ్వలేం కదా?’ అని వారికి ఆయన చెప్పి పంపినట్లు తెలిసింది. సీఎం మాటలను బట్టి చూస్తే కర్నూలు రాజధాని లేనట్లే అని తేలిపోయింది. అదే విధంగా తనను కలిసిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్లకూ ఇదే విషయాన్ని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు తెలిసింది. రాజధాని ఊసెత్తవద్దని.. ఏదైనా కావాలంటే నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడమని చెప్పినట్లు సమాచారం. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎంతో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గురువారం సమావేశమయ్యారు. కర్నూలును రాజధానిని చేయాలని జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును అడుగుతుంటే తమ్ముళ్లంతా తలదించుకునే ఉండిపోయినట్లు సమాచారం. ప్రభుత్వ అతిథగృహంలో టీడీపీ నేతలు, రాజధాని సాధన కమిటీకి ఎదురైన సంఘటనను చూస్తే కర్నూలు రాజధాని గురించి మర్చిపోవచ్చని తమ్ముళ్లు చెప్పుకుంటూ వెళ్లటం కనిపించింది. ఇదిలా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించాలని సీఎంను కోరారు. అలాగే ఎంపీ బుట్టారేణుక, పాణ్యం ఎమ్మెల్యేల గౌరు చరిత, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కూడా నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిసి విన్నవించారు. కర్నూలుకు రాజధాని అడిగేహక్కు ఉందని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. రాజధానిని పోగొట్టుకుని, ఇప్పుడు అవకాశం ఉండి ఇవ్వకపోతే అన్యాయం చేసిన వారవుతారని కోరినట్లు తెలిసింది. అదే విధంగా గుండ్రేవుల రిజర్వాయర్, కర్నూలులో ఉర్దూ పాఠశాల అవసరమని ఎస్వీ మోహ న్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో ఐటీ, పారిశ్రామిక కారిడార్, అగ్రికల్చర్ యూనివర్సిటీకు అనుకూలంగా ఉందని, ఆమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు కూడా స్థానిక సమస్యలపై చర్చకే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. కోరికల చిట్టాలకు ఓకే చెప్పిన సీఎం.. కర్నూలు రాజధానిని చేయాలనే మాటెత్తకుండా అధినేత చంద్రబాబు తమ్ముళ్లను అదుపుచేసినట్లు తెలిసింది. దీంతో చేసేది లేక తమ్ముళ్లు నియోజకవర్గంలోని కోరికల చిట్టాను అధినేత చంద్రబాబు ముందుంచారు. ఆ చిట్టాలన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు టీడీపీ నేతలు వెళ్లడించారు. ఆ వివరాలను స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రకటించనున్నట్లు వారు వివరించారు. మరి కొన్నింటికి మాత్రం ‘చూద్దాం.. చేద్దాం’ అన్న సమాధానమే ఎదురైనట్లు టీడీపీ శ్రేణులు వెళ్లడించాయి. నామినేటెడ్ పదవుల కోసం తమ్ముళ్ల క్యూ.. శ్రీశైలం, మహానంది, యాగంటి తదితర ఆలయాలతోపాటు జిల్లాలోని 12 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం తమ్ముళ్లంతా అధినేత వద్ద క్యూ కట్టారు. నియోజకవర్గఇన్చార్జ్లు తమ వారికి ఆ పదివి.. ఈ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే నామినేటెడ్ పదవుల విషయమై తమ్ముళ్లకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. -
బంద్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యాసంస్థల యాజమాన్యం స్పందించింది. జిల్లా వ్యాప్తం గా పలుప్రాంతాల్లో ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేసి ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించా రు. అదే విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి నిరసనలు తెలియజేశారు. బంద్‌తో కలెక్టర్, జెడ్పీ కార్యాలయాలు బోసిపోయి కనిపించాయి. ఆర్టీసీ బస్సులు బస్టాండ్లకే పరిమితమయ్యాయి. ఫలితంగా శుక్రవారం ఆర్టీసీకి రూ.30 లక్షలు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పరిరక్షణ వేదిక, సమైక్యరాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ, విద్యార్థి జేఏసీ నాయకులు కూడా బంద్‌లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణు లు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కల్లూరు పరిధిలో పార్టీ నాయకులు పెరుగు పురుషోత్తంరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, ప్రభుత్వ కార్యాలయాలను మూయించి బంద్‌కు సహకరించాలని కోరారు. నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పద్మావతినగర్ నుంచి మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. పట్టణమంతా బైక్‌లపై తిరుగుతూ బ్యాంక్‌లను, షాపులను, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. టీ బిల్లు చర్చను నిరసిస్తూ స్థానిక సమతా హిజ్రాల సంఘం ఆధ్వర్యంలో నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆటపాటతో నిరసనను తెలియజేశారు. అళ్లగడ్డ పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలను ముసి వేయించి మోటర్ సైకిల్ ర్యాలి చేశారు, నాల్గురోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పత్తికొండలో నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి పట్టణంలో పర్యటించి బంద్ విజయవంతం చేశారు. బంద్‌కు జనం మద్దతు... ఆత్మకూరులో వైఎస్సార్సీపీ శ్రేణులు తెల్లవారుజామున ఐదుగంటలకే రోడ్లపైకి వచ్చి వాహనాలను నిలిపివేశారు. ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సునుకూడా బయటకు రాకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. షాపులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంక్‌లు స్వచ్ఛందంగా మూసివేశారు. అదే విధంగా విద్యాసంస్థల యాజమాన్యం బంద్‌కు సహకరించింది. బనగానపల్లెలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ఎర్రబోతుల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కాటసాని ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ పాటించారు. కోవెలకుంట్లలో ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎమ్మిగనూరులో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా పాల్గొంది. ఎమ్మెల్యే తనయుడు, కేడీసీసీ బ్యాంక్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, జేఏసీ చెర్మైన్ ఈశ్వరయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బీవీ.జయనాగేశ్వర్రెడ్డిల నేతృత్వంలో పట్టణంలో మోటర్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఆదోని పట్టణంలో బంద్‌కు సంపూర్ణమైంది. మంత్రాలయం, ఆలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కన్వీనర్లు బంద్ నిర్వహించారు. నందికొట్కూరులో ఐజయ్య, బండి జయరాజ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. పటేల్సెంటర్లో బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని బంద్ చేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.