
‘అనంత’తో సమస్యలను చెప్పుకుంటున్న షికారీలు
సాక్షి, అనంతపురం: ‘మాకు కులం గుర్తింపు లేదు. ఎన్నిమార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. పిల్లలను బడిలో చేర్పించాలంటే కుల ధ్రువీకరణ అడుగుతున్నారు. ఇల్లు మంజూరు చేయాలంటే కులధ్రువీకరణ పత్రం అడుగుతున్నారు. ఏదో ఒక కులంగా గుర్తించమంటే పట్టించుకోవడం లేదు’ అని నగరంలోని బుడ్డప్పనగర్ షికారీలు శివమ్మ, గౌరి, లక్ష్మీ, చిరంజీవి తదితరులు మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డితో ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం 24వ డివిజన్‌లో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతతో పాటు వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగే పరుశురాం, నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు మీసాల రంగన్న, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి తదితరులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ‘నవరత్నాల’æ పథకాల గురించి తెలియజేశారు.
కాలువలు శుభ్రం చేయడం లేదు
కాలనీలో కాలువలు శుభ్రమే చేయడం లేదని దిల్‌షాద్ అనే మహిళ వాపోయింది. కార్పొరేటర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఈవైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలపై ‘1100’కు ఫోన్ చేస్తే అమరావతి నుంచి కూడా స్పందిస్తారని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పక్కాఇల్లు మంజూరు చేయాలని ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా ఉపయోగం లేదని వెంకటలక్ష్మి అనే మహిళ నాయకుల దృష్టికి తీసుకొచ్చింది. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ,తదితరులు పాల్గొన్నారు.
నేడు 42వ డివిజన్‌లో..
నగరంలోని 42వ డివిజన్‌లో మంగళవారం ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం ఉంటుందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఉదయం 7.30 గంటలకు నడిమివంక గంగమ్మ గుడి వద్ద నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, డివిజన్ల కన్వీనర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.