
‘ముప్పాళ్ల’ బాధ్యులపై చర్యలు తీసుకోండి
డీజీపీ రాముడుకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
హైదరాబాద్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలపై దాడి, ఎంపీటీసీల కిడ్నాప్ ఉదంతంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ైవె సీపీ నేతలు శుక్రవారం ఏపీ డీజీపీ రాముడుకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఎండీ ముస్తాఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో పాటు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో కూడిన బృందం డీజీపీని కలిసింది. గుంటూరు నుంచి ఎంపీటీసీలను తీసుకొస్తున్న అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాలపై దాడి చేసిన టీడీపీ గూండాలు దౌర్జన్యంగా నలుగురు ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని డీజీపీకి వివరించారు.
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఎన్నికైన 175 మంది శాసనసభ్యుల్ని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ఉన్న శాసనసభాపతి నియోజకవర్గంలోనే ఈ దుశ్చర్య జరగడం దురదృష్టకరమ న్నారు. రాజకీయ పార్టీకి చెందిన వారే దోపిడీ దొంగల్లా మారి నడిరోడ్డుపై రాజకీయాన్నే దోచుకుపోతున్నారని అంబటి దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు ఒకపక్క తరచుగా రామరాజ్యం, రాముడి గురించి మాట్లాడుతూ.. రాక్షసపాలన కొనసాగిస్తున్నారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.