శాంతిభద్రతల అంశంపై తక్షణం చర్చించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీలో పట్టుబట్టారు. తాము సోమవారమే 344 నిబంధన కింద ఈ అంశంపై చర్చ కోసం నోటీసు ఇచ్చామని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగోలేనందున దీనిపై చర్చ అవసరమని అన్నారు. అయితే.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాత్రం ఈ అంశాన్ని రేపటికి పోస్ట్ చేద్దామని, రేపు చర్చిద్దామని, ప్రస్తుతం ఈ అంశంపై సభా నాయకుడైన ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారని చెప్పారు. దానిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైఎస్ఆర్ కుటుంబంపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో సభలో తీవ్ర దుమారం రేగింది. వైఎస్ఆర్సీసీ సభ్యులు ఒక్కసారిగా సీట్లలోంచి లేచి, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి, 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. 'హత్యా రాజకీయాలపై చర్చ జరపాలి' అని కూడా నినాదాలిచ్చారు. తాను నోటీసు ఇవ్వాలన్నానే తప్ప మంగళవారమే చర్చిస్తామని చెప్పలేదని, ఈ అంశంపై చర్చ రేపు చేపట్టాలని కోడెల చెప్పారు. ఒకవైపు ప్రతిపక్ష సభ్యులు చర్చ కోసం గట్టిగా పట్టుబడుతుండగా, వారికి పోటీగా అధికార పక్ష సభ్యులు కూడా సీట్లలోంచి లేచి అరుస్తుండటంతో ఇరు పక్షాలను సమాధానపర్చడానికి స్పీకర్ ప్రయత్నించారు. అయితే.. రాక రాక సభకు వచ్చి మాట్లాడటం వల్లే అధికార పక్ష సభ్యులు కూడా మాట్లాడుతున్నారని, లేకపోతే వాళ్లు మాట్లాడేవాళ్లు కారంటూ ఆయన చెప్పారు. శాంతిభద్రతల అంశాన్ని లేనిపోని అంశమంటూ టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించింది. సభలో ముఖ్యమంత్రి హావభావాలు కూడా అందుకు అనుగుణంగానే అనిపించాయి. సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో తమ నిరసన కొనసాగించడంతో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
శాంతిభద్రతలపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు
Published Tue, Aug 19 2014 12:05 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement
Advertisement