
దగాపై ‘ధర్నా’గ్రహం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రుణమాఫీ హామీతో ఊరించి, అధికారంలోకి వచ్చాక రైతులకు, డ్వాక్రా మహిళలకు మొండిచెయ్యి చూపిన టీడీపీ సర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖం పూరిస్తోంది. ‘మీ రుణాలు చెల్లించకండి. నాదీ భరోసా’ అన్న మాట ప్రకారం ఎంతో ఆశతో ఎదురు చూస్తే.. గత ఐదునెలలుగా మాఫీ రేపు, మాపంటున్న చంద్రబాబుపై రైతులకు, మహిళలకు నమ్మకం సడలిపోయింది. ఇప్పటికే రుణాలపై వడ్డీలు, చక్రవడ్డీలు తడిసిమోపెడై వారు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. జిల్లాలో 3.60 లక్షల మంది రైతులు పంట రుణాలు, 4.50 లక్షల మంది బంగారంపై రుణాలు తీసుకున్నారు.
రూ.2,350 కోట్ల పంట రుణాలు, రూ.3,860 కోట్ల బంగారం రుణాలు రైతులు తీసుకున్న రుణమొత్తం రూ.6,210 కోట్ల పై మాటే. వీరంతా మాఫీపై గంపెడాశతో రుణాలు చెల్లించలేదు. ఇప్పుడదే రైతులకు శరాఘాతంగా మారింది. సకాలంలో రుణాలు చెల్లించని కారణంగా గత జూన్ వరకు రావలసిన పావలా వడ్డీ రాయితీని రూ.478.80 కోట్ల మేర రైతులు కోల్పోయారు. జూలై నుంచి అక్టోబరు వరకు అదనపు వడ్డీతో మరో రూ.214.60 కోట్ల భారం వారిపై పడింది. ఇక డ్వాక్రా మహిళల రుణ వాయిదాలను వారి పొదుపు ఖాతాల నుంచి బ్యాంక్‌లు జమ చేసేసుకోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సమరానికి సమాయత్తం..
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెడలు వంచి, రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీకి ఇచ్చిన హామీని అమలు చేయించేందుకు వైఎస్సార్ సీపీ నడుం బిగించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో బుధవారం జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ఆందోళన చేపడుతున్నారు. కాగా ఈ పోరులో భాగస్వాములయ్యేందుకు రైతులు, మహిళలు, ప్రజలు ముందుకు వస్తున్నారు. రుణమాఫీపై దగా చేసిన సర్కారుపై పోరాటానికి జగన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు, శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ తొలుత జిల్లా ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.
అనంతరం పార్టీ నేతలు నియోజకవర్గాల వారీగా సమావేశమయ్యారు. బుధవారం అన్ని మండల కేంద్రాలు, కాకినాడ, రాజమండ్రి నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ధర్నాలకు సన్నద్ధమయ్యారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేసేవరకు ప్రజా భాగస్వామ్యంతో పోరాడేందుకు సిద్ధం కావాలని జ్యోతుల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం తలపెట్టిన ధర్నాను పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు. రుణ మాఫీ అమలు కాక రైతులు, డ్వాక్రా మహిళలపై పడ్డ భారాన్ని వివరించి, వారితో కలిసి ఆందోళనలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు సాగుతున్న సమరంలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.