
అధ్వానం... అగమ్యగోచరం
పట్నంబజారు (గుంటూరు) : గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (పెద్దాసుపత్రి)లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట పెద్దాసుపత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన నేపథ్యంలో అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. పార్టీ నేతలు మాజీ మంత్రి కొలుసు పార్ధసారథి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, డాక్టర్లు నన్నపనేని సుధ, జగన్మోహనరావులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
వీరితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహరనాయుడులతో కలసి కమిటీ ఆదివారం ఆసుపత్రిలో పర్యటించింది. ఈ సందర్భంగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.
ముందుగా కమిటీ ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్‌ను కలిసిం ది. ఇక్కడ పారిశుధ్యం ఎప్పటినుంచో అధ్వానంగా ఉంది, దీనిపై ఎమ్మెల్యేలు పలుమార్లు చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు. వార్డుల్లో ఏళ్లతరబడి ఎలుకలు సంచరిస్తున్నా ఎందుకు పట్టించుకోలేదు. కొరత ఉందని తెలిసినా సిబ్బంది ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు. ఇలా కమిటీ సంధించిన పలు ప్రశ్నలకు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మాత్రం తనకు తెలియదనే సమాధానం ఇచ్చారు. దీనిపై కమిటీ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా బాధ్యులైన వైద్యాధికారులకు తెలియకపోతే ఎలా అని పేర్కొంది.
నర్సుల కొరత...
స్టాఫ్ నర్సులను కలసి మాట్లాడిన అనంతరం ఆసుపత్రిలో నర్సుల కొరత ఉండటాన్ని వైఎస్సార్ సీపీ కమిటీ గమనించింది. దాదాపు 600 మంది నర్సుల వరకు అవసరం కాగా, కేవలం 180 మంది మాత్రమే ఉన్నారని నర్సులు వివరించారు. అనంతరం పసికందు మృతి చెందిన వార్డును కమిటీ సందర్శించింది. అక్కడే ఉన్న హౌస్ సర్జన్‌లతో సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పసికందు మృతికి ముందే ఎలుకల సంచారంపై ఫిర్యాదు చేసిన కాపీని ఈ సందర్భంగా కమిటీకి చూపించారు.
నర్సుల వినతిపత్రం..
ఆసుపత్రిలో తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నర్సుల అసోసియేషన్ నాయకురాలు రమణ ఆధ్వర్యంలో నర్సులు వైఎస్సార్ సీపీ కమిటీకి వినతి పత్రం అందజేశారు. ఒక్క స్టాఫ్ నర్సు మూడు, నాలుగు వార్డుల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పసికందు మృతి ఘటనలో నర్సును సస్పెండ్ చేయటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సుల నియామ కం జరిగి 30 ఏళ్లు అవుతోందని తెలియజేశారు. ఈ సమస్యలను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతామని కమిటీ వారికి భరోసానిచ్చి ముందుకు సాగింది.
పర్యటనలో వైఎస్సార్ సీపీ పలు విభాగాల నేతలు మామిడి రాము, కొత్తా చిన్నపరెడ్డి, సయ్యద్‌మాబు, కోవూరి సునీల్‌కుమార్, మెట్టు వెంకటప్పారెడ్డి, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, షేక్ గులాంరసూల్, కోటా పిచ్చిరెడ్డి, పానుగంటి చైతన్య, ఆరుబండ్ల వెంకటకొండారెడ్డి, షేక్ జానీ, ఉప్పుటూరి నర్సిరెడ్డి, రాచకొండ ముత్యాలరాజు, ప్రేమ్‌కుమార్, మండే పూడి పురుషోత్తం, జూలూరి హేమంగదగుప్తా, రాజశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు.