సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనిచ్చింది. జిల్లాలోని మొత్తం ఆరింటిలో ఎన్నికలు జరగ్గా ఆ పార్టీ రెండు మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది. మునిసిపల్ ఎన్నికల పోలింగ్ మార్చి 30న జరిగినప్పటికీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వాయిదా వేసిన ఓట్ల లెక్కింపును అధికారులు సోమవారం పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల, గిద్దలూరు మునిసిపాలిటీల్లో విజయం సాధించింది.
గిద్దలూరులో తెలుగుదేశంకు అతి తక్కువ ఓట్లు పోలవ్వడం గమనించదగ్గ విషయం. అయితే రెండుచోట్ల వైఎస్సార్ సీపీ గెలిచినా, తెలుగుదేశంకు అందనంత దూరంలో విజయం సాధించింది.
గిద్దలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 9,387 ఓట్లు పోలవ్వగా, తెలుగుదేశం పార్టీకి కేవలం 2,253 ఓట్లు మాత్రమే పోలై మూడవ స్థానానికి చేరుకుంది.
చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 17,180 ఓట్లు పోలవ్వగా, తెలుగుదేశంకు 13,572 ఓట్లు పోలయ్యి మూడవ స్థానానికి చేరుకుంది.
గిద్దలూరులో బీఎస్‌పీ, స్వతంత్ర అభ్యర్థులు 8,193 ఓట్లు పొంది రెండవ స్థానంలో నిలిచారు.
చీరాలలో నవోదయం పార్టీ 15,553 ఓట్లతో రెండవ స్థానంలో ఉంది.
టీడీపీ మూడవ స్థానానికి చేరడంపై ఆ పార్టీలో నిర్వేదం చోటు చేసుకుంది.
మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ గెలిచినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత సమీపంలోనే ఉండటం విశేషం. చీమకుర్తిలో తెలుగుదేశంకు 9,334 ఓట్లు పోలవ్వగా, వైఎస్సార్‌సీపీ 8,424 ఓట్లతో రెండవ స్థానంలో ఉంది.
మార్కాపురంలో తెలుగుదేశంకు 16,928 ఓట్లు పోలవ్వగా, వైఎస్సార్ సీపీకి 15,238 ఓట్లు లభించాయి.
అద్దంకిలో తెలుగుదేశంకు 11,804 ఓట్లు రాగా, వైఎస్సార్ సీపీకి 9,843 ఓట్లు పోలయ్యాయి.
దాదాపు అన్ని మునిసిపాలిటీల్లోను తెలుగుదేశంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది.
ముఖ్యంగా గిద్దలూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభ విజయవంతమయ్యిందని ప్రచారం చేసుకున్నారు. అదే నిజమైతే గిద్దలూరులో తెలుగుదేశం గెలిచి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు.
చీరాలలో ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రాగా, ఆయన ప్రచారాన్ని అడ్డుకోవడానికి మైకులు, విద్యుత్ సరఫరాను క ట్ చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్న వైఎస్సార్ సీపీ మునిసిపాలిటీల్లో తక్కువ స్థానాలు సాధించినా, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
వైఎస్సార్ సీపీకి పట్టం
Published Tue, May 13 2014 3:24 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement