సాక్షి, కడప : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ అందించే రాయితీ బస్‌పాసుల పరిమితి 35 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల పరిధి పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెల 1 నుంచే ఆర్టీసీ అధికారులు అమలు చేస్తున్నారు. దీంతో వేలాది మంది గ్రామీణ పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 35 కిలో మీటర్లను ఏడు శ్లాబులుగా విడదీసి చార్జీలను వసూలు చేసేవా రు. అయితే తాజాగా 50 కిలో మీటర్లకు మార్పుచేసి పరిధి పెంచిన నేపథ్యంలో 40,45, 50 కిలో మీటర్లకు శ్లాబులను ఏర్పాటు చేసి చార్జీలను నిర్ణయించారు.
వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం
జిల్లాలో కడప, బద్వేలు, పులివెందుల, రాయచోటి, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేటలలో ఆర్టీసీ డిపోలున్నాయి. 12 ఏళ్లలోపు బాల బాలికలకు, 18 సంవత్సరాలలోపు బాలికలకు ఉచితంగా బస్‌పాసులు అందిస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాలలో విద్యార్థులు 4.50లక్షల మంది చదువుకుంటున్నారు. వీరిలో నిత్యం పట్టణాలకు, మండల కేంద్రాలకు బస్సులలో ప్రయాణించి వచ్చి చదువుకుంటున్నవారు 50 వేల మంది ఉన్నారు. పాస్‌ల ద్వారా విద్యార్థులను చేరవేసే బస్సులు కడప డిపో నుంచి 12, పులివెందుల 11, రాజంపేట 7, రాయచోటి 10, జమ్మలమడుగు 5, ప్రొద్దుటూరు 5, బద్వేలు 3 ఉన్నాయి. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం ఆయా రూట్లలో బస్సులను నడుపుతున్నారు. ఇవి కాకుండా ఆయా రూట్లలో ప్రయాణించే సాధారణ బస్సులను కూడా బస్సు పాసులు కలిగిన విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి మం డల, పట్టణ కేంద్రాల్లోని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది.
పల్లెకు చేరని వెలుగులు...
జిల్లాలో ఎనిమిది డిపోల పరిధిలో ప్రధాన రహదారుల్లో మాత్రమే ఆర్టీసీ సంస్థ సర్వీసు బస్సులను నడుపుతోంది. కొన్నిచోట్ల రహదారి సౌకర్యం ఉన్నా కూడా సర్వీసులను నడపడం లేదు. ఆయా రూట్లలో నష్టాలు వస్తున్నాయని సాకుగా చూపించి సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉచిత బస్సు పాసులు, రాయితీ బస్సు పాసులు ఉన్నప్పటికీ ఆయా రూట్లలో బస్సులు లేనందున విద్యార్థులు పాసులను వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి గ్రామీణ రూట్లను పరిశీలించి సర్వీసులను పునరుద్ధరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ నెల 1 నుంచే అమలు..
ఉచిత బస్సు పాసుల దూరం పరిమితిని సడలించారు. 35 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాం. సెప్టెంబర్ 1 నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. ఆర్టీసీపై భారం పడినా కూడా ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉండడం సంతోషకరం. అర్హులైన విద్యార్థులందరికీ అటు ఉచిత పాసులు, ఇటు రాయితీ పాసులు అందించాం.
– వెంకట శేషయ్య, రీజినల్ మేనేజర్, ఆర్టీసీ కడప రీజియన్
వైఎస్ జగన్ నిర్ణయంసంతోషదాయకం
ఈ ప్రభుత్వానికి విద్యార్థులన్నా, విద్య అన్న మక్కువ ఎక్కువ. అందులో భాగంగా ఆర్టీసీ బస్సులకు దూరం పెంచడం సంతోషదాయకం.
– రాగిణి, విద్యార్థిని, ప్రొద్దుటూరు
పేద విద్యార్థులకు వరం
మాలాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరం లాంటిది. సుదూర ప్రాంతాల నుంచి నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి చదుకునే అవకాశం లభించింది.
– షేక్ వలీ, విద్యార్థి ఎర్రగుంట్ల
విద్యాభివృద్ధికి చేయూత
రాష్ట్ర ప్రభుత్వం బస్సు పాసుల జారీపై తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యాభివృద్ధికి చేయూత ఇచ్చినట్లయింది. పేద, మధ్య తరగతి విద్యార్థులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి చదువుకునే వెసులుబాటు కల్పించడం అభినందనీయం.
– దేవేంద్రరెడ్డి, విద్యార్థి లింగారెడ్డిపల్లి
Comments
Please login to add a commentAdd a comment