Bus pass charges
-
బస్‌పాస్ చార్జీల పెంపు ఉపసంహరించండి
సాక్షి, హైదరాబాద్: భారీగా బస్‌పాస్ చార్జీల పెంపు నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలను చదువుకు దూరం చేసేలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉందని పేర్కొన్నారు. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆ ట్వీట్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
స్టూడెంట్స్పై ఆర్టీసీ దెబ్బ.. భారీగా పెరిగిన బస్ పాస్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: ‘ఉరుము ఉరిమి మంగళం మీడ పడ్డట్టు’ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో విద్యార్థుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ పిడుగుపాటులా పెంచిన చార్జీలతో విద్యార్థి లోకంపై అశనిపాతమే అయింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్‌లైన్ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు.. ఇక నుంచి ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా బస్‌పాస్ చార్జీలను పెంచడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం నాటి రాయితీలను కూడా సవరించడంతో భారం రెండింతలైంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులకు ఇప్పుడు ఆర్టీసీ చార్జీలే గుదిబండగా మారాయి. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్ రాయితీల నుంచి ఆర్టీసీ క్రమంగా తప్పుకొనేందుకే ఈ భారాన్ని మోపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం పట్ల విద్యార్ధి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త చార్జీల ప్రకారమే.. సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు నెలవారీ, మూడు నెలల సాధారణ బస్‌పాస్‌లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు,రూట్ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లా బస్సుల్లో నగర శివార్ల వరకు అనుమతించే బస్‌పాస్‌లు కూడా ఉన్నాయి. మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు పెరిగింది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.600కు పెంచారు. చదవండి: ఉప్పల్ కష్టాల్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం ప్రస్తుతం వివిధ రకాల విద్యార్థుల పాస్‌లపై ఆర్టీసీకి ప్రతి నెలా రూ.8 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా చార్జీల పెంపుతో మరో రూ.15 కోట్లకుపైగా అదనంగా లభించనుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులపై రూ.180 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థుల నుంచి ఆర్టీసీ బస్‌పాస్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను స్వీకరించి 15 నుంచి జారీ చేయనుంది. కొత్త చార్జీల ప్రకారమే ఈ పాస్‌లను అందజేయనున్నారు. ఆందోళన ఉద్ధృతం చేస్తాం: ఇప్పటికే కోవిడ్ కారణంగా చదువులకు దూరమైన విద్యార్థులపై బస్‌పాస్ చార్జీల భారం మోపడం దారుణం. నిరుపేద పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది, బస్‌పాస్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధృతం చేస్తాం. – రాథోడ్ సంతోష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోయలేని భారం బస్‌పాస్ చార్జీలు ఒక్కసారిగా ఇలా పెంచడం అన్యాయం. సిటీబస్సులపై ఆధారపడి కాలేజీకి వెళ్లే నాలాంటి వారికిది ఎంతో భారం. పెంచిన బస్‌పాస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – వంశీ, ఇంటర్ విద్యార్ధి రూట్ పాస్‌లు కిలోమీటర్లు ప్రస్తుతం పెంచిన చార్జీ (రూ.లలో) 4 165 450 8 200 600 12 245 900 18 280 1150 22 330 1350 -
Hyderabad: బస్‌పాస్ చార్జీలు భారీగా పెంపు?
సాక్షి, హైదరాబాద్: సాధారణ ప్రయాణికులే లక్ష్యంగా డీజిల్ సెస్, టిక్కెట్ ధరల రౌండాఫ్ నెపంతో ఇప్పటికే నగరంలో చార్జీల మోత మోగిస్తున్న ఆర్టీసీ..తాజాగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది. బస్‌పాస్ చార్జీలను భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఉన్న చార్జీలను ఇంచుమించు రెట్టింపు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. నగరంలో సాధారణ నెలవారీ బస్‌పాస్‌లతో (జీబీటీ)పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు, సాధారణ క్వార్టర్లీ పాస్‌లు, గ్రేటర్ హైదరాబాద్ క్వార్టర్లీ పాస్‌లను ఎక్కువ మంది విద్యార్థులు వినియోగిస్తున్నారు. అలాగే ఇంటి నుంచి కాలేజీ వరకు వెళ్లి వచ్చేందుకు రూట్ పాస్‌లకు కూడా డిమాండ్ బాగా ఉంటుంది. ఇలా వివిధ రకాల పాస్‌లను వినియోగిస్తున్న విద్యార్థుల సంఖ్య 5 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా. ఈ విద్యార్థులు బస్‌పాస్‌ల కోసం ప్రతి నెలా ఆర్టీసీకి ప్రస్తుతం రూ.8.5 కోట్ల వరకు చెల్లిస్తుండగా తాజా పెంపుతో మరో రూ.5 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ప్రస్తుతం సాధారణ నెల వారీ పాస్ రూ.165 ఉండగా, తాజాగా రూ.300 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే క్వార్టర్లీ పాస్ రూ.495 నుంచి రూ.650 వరకు పెరగవచ్చునని అంచనా. ఏ బస్‌పాస్‌పైన ఎంత వరకు చార్జీలు పెరిగాయనే అంశాన్ని బుధవారం అర్ధరాత్రి వరకు కూడా ఆర్టీసీ స్పష్టం చేయకపోవడం గమనార్హం. చదవండి: (సదరం స్కాంపై ఏసీబీ కేసు!) -
దూరం పెరిగింది.. భారం తగ్గింది
సాక్షి, కడప : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ అందించే రాయితీ బస్పాసుల పరిమితి 35 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల పరిధి పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెల 1 నుంచే ఆర్టీసీ అధికారులు అమలు చేస్తున్నారు. దీంతో వేలాది మంది గ్రామీణ పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 35 కిలో మీటర్లను ఏడు శ్లాబులుగా విడదీసి చార్జీలను వసూలు చేసేవా రు. అయితే తాజాగా 50 కిలో మీటర్లకు మార్పుచేసి పరిధి పెంచిన నేపథ్యంలో 40,45, 50 కిలో మీటర్లకు శ్లాబులను ఏర్పాటు చేసి చార్జీలను నిర్ణయించారు. వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం జిల్లాలో కడప, బద్వేలు, పులివెందుల, రాయచోటి, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేటలలో ఆర్టీసీ డిపోలున్నాయి. 12 ఏళ్లలోపు బాల బాలికలకు, 18 సంవత్సరాలలోపు బాలికలకు ఉచితంగా బస్‌పాసులు అందిస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాలలో విద్యార్థులు 4.50లక్షల మంది చదువుకుంటున్నారు. వీరిలో నిత్యం పట్టణాలకు, మండల కేంద్రాలకు బస్సులలో ప్రయాణించి వచ్చి చదువుకుంటున్నవారు 50 వేల మంది ఉన్నారు. పాస్‌ల ద్వారా విద్యార్థులను చేరవేసే బస్సులు కడప డిపో నుంచి 12, పులివెందుల 11, రాజంపేట 7, రాయచోటి 10, జమ్మలమడుగు 5, ప్రొద్దుటూరు 5, బద్వేలు 3 ఉన్నాయి. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం ఆయా రూట్లలో బస్సులను నడుపుతున్నారు. ఇవి కాకుండా ఆయా రూట్లలో ప్రయాణించే సాధారణ బస్సులను కూడా బస్సు పాసులు కలిగిన విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి మం డల, పట్టణ కేంద్రాల్లోని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది. పల్లెకు చేరని వెలుగులు... జిల్లాలో ఎనిమిది డిపోల పరిధిలో ప్రధాన రహదారుల్లో మాత్రమే ఆర్టీసీ సంస్థ సర్వీసు బస్సులను నడుపుతోంది. కొన్నిచోట్ల రహదారి సౌకర్యం ఉన్నా కూడా సర్వీసులను నడపడం లేదు. ఆయా రూట్లలో నష్టాలు వస్తున్నాయని సాకుగా చూపించి సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉచిత బస్సు పాసులు, రాయితీ బస్సు పాసులు ఉన్నప్పటికీ ఆయా రూట్లలో బస్సులు లేనందున విద్యార్థులు పాసులను వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి గ్రామీణ రూట్లను పరిశీలించి సర్వీసులను పునరుద్ధరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నెల 1 నుంచే అమలు.. ఉచిత బస్సు పాసుల దూరం పరిమితిని సడలించారు. 35 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాం. సెప్టెంబర్ 1 నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. ఆర్టీసీపై భారం పడినా కూడా ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉండడం సంతోషకరం. అర్హులైన విద్యార్థులందరికీ అటు ఉచిత పాసులు, ఇటు రాయితీ పాసులు అందించాం. – వెంకట శేషయ్య, రీజినల్ మేనేజర్, ఆర్టీసీ కడప రీజియన్ వైఎస్ జగన్ నిర్ణయంసంతోషదాయకం ఈ ప్రభుత్వానికి విద్యార్థులన్నా, విద్య అన్న మక్కువ ఎక్కువ. అందులో భాగంగా ఆర్టీసీ బస్సులకు దూరం పెంచడం సంతోషదాయకం. – రాగిణి, విద్యార్థిని, ప్రొద్దుటూరు పేద విద్యార్థులకు వరం మాలాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరం లాంటిది. సుదూర ప్రాంతాల నుంచి నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి చదుకునే అవకాశం లభించింది. – షేక్ వలీ, విద్యార్థి ఎర్రగుంట్ల విద్యాభివృద్ధికి చేయూత రాష్ట్ర ప్రభుత్వం బస్సు పాసుల జారీపై తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యాభివృద్ధికి చేయూత ఇచ్చినట్లయింది. పేద, మధ్య తరగతి విద్యార్థులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి చదువుకునే వెసులుబాటు కల్పించడం అభినందనీయం. – దేవేంద్రరెడ్డి, విద్యార్థి లింగారెడ్డిపల్లి -
బస్ పాస్ చార్జీల తగ్గింపు
సాక్షి, ముంబై : విద్యార్థుల సీజన్ పాస్ చార్జీలు తగ్గించాలని బెస్ట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మాస, త్రైమాసిక, ఆర్ధవార్షిక సీజన్ పాస్ పొందే విద్యార్థులకు రూ.25 నుంచి రూ.100 వరకు తగ్గించనున్నట్లు బెస్ట్ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు భారీగా రాయితీ కల్పించింది. మొన్నటి వరకు విద్యార్థులు రూ.200 చెల్లిస్తుండగా, ఇకనుంచి బీఎంసీ పాఠశాలల విద్యార్థులు రూ.150, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే త్రైమాసిక పాస్ పొందే విద్యార్థులు రూ.550 చెల్లిస్తుండగా ఇక నుంచి బీఎంసీ పాఠశాల విద్యార్థులు రూ.450, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఆరు నెలల పాస్ పొందే విద్యార్థులు రూ.1000 చెల్లించేవారు. ఇక నుంచి బీఎంసీ విద్యార్థులు రూ.750, ప్రైవేటు విద్యార్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి రెండు రెట్లు పెంపు రెండేళ్ల కిందట నెల పాస్‌కు రూ.90 వసూలు చేసేవారు. అయితే గత విద్యా సంవత్సరంలో దాన్ని రూ.135, తరువాత కొద్ది రోజులకు రూ.165 పెంచారు. ఇప్పుడేమో రూ.200 పెంచేశారు. దీంతో బెస్ట్ పరిపాలన విభాగం తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్తో భేటీ అయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులపై పడుతున్న చార్జీల భారం గురించి వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన సుధీర్, బెస్ట్ జనరల్ మేనేజరు జగ దీశ్ పాటిల్‌తో మంత్రాలయలో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గిస్తారో, లేక రవాణా పన్ను చెల్లిస్తారో ఆలోచించుకోవాలని జగదీశ్‌కు సూచించారు. బెస్ట్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం చార్జీలు తగ్గించాలనే నిర్ణయానికొచ్చినట్లు మునగంటివార్‌కు జగదీశ్ తెలిపారు. అనంతరం చార్జీల తగ్గింపు ప్రతిపాదన రూపొందించి బెస్ట్ స్థాయి సమితి ముందుంచి ఆమోదం పొందేలా చేసినట్లు చెప్పారు. దీంతో విద్యార్థులకు చార్జీల భారం నుంచి ఊరట లభించినట్లయింది.