బస్ పాస్ చార్జీల తగ్గింపు
సాక్షి, ముంబై : విద్యార్థుల సీజన్ పాస్ చార్జీలు తగ్గించాలని బెస్ట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మాస, త్రైమాసిక, ఆర్ధవార్షిక సీజన్ పాస్ పొందే విద్యార్థులకు రూ.25 నుంచి రూ.100 వరకు తగ్గించనున్నట్లు బెస్ట్ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు భారీగా రాయితీ కల్పించింది. మొన్నటి వరకు విద్యార్థులు రూ.200 చెల్లిస్తుండగా, ఇకనుంచి బీఎంసీ పాఠశాలల విద్యార్థులు రూ.150, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే త్రైమాసిక పాస్ పొందే విద్యార్థులు రూ.550 చెల్లిస్తుండగా ఇక నుంచి బీఎంసీ పాఠశాల విద్యార్థులు రూ.450, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఆరు నెలల పాస్ పొందే విద్యార్థులు రూ.1000 చెల్లించేవారు. ఇక నుంచి బీఎంసీ విద్యార్థులు రూ.750, ప్రైవేటు విద్యార్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.
ఒకేసారి రెండు రెట్లు పెంపు
రెండేళ్ల కిందట నెల పాస్‌కు రూ.90 వసూలు చేసేవారు. అయితే గత విద్యా సంవత్సరంలో దాన్ని రూ.135, తరువాత కొద్ది రోజులకు రూ.165 పెంచారు. ఇప్పుడేమో రూ.200 పెంచేశారు. దీంతో బెస్ట్ పరిపాలన విభాగం తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్‌తో భేటీ అయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులపై పడుతున్న చార్జీల భారం గురించి వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన సుధీర్, బెస్ట్ జనరల్ మేనేజరు జగ దీశ్ పాటిల్‌తో మంత్రాలయలో సమావేశం ఏర్పాటు చేశారు.
విద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గిస్తారో, లేక రవాణా పన్ను చెల్లిస్తారో ఆలోచించుకోవాలని జగదీశ్‌కు సూచించారు. బెస్ట్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం చార్జీలు తగ్గించాలనే నిర్ణయానికొచ్చినట్లు మునగంటివార్‌కు జగదీశ్ తెలిపారు. అనంతరం చార్జీల తగ్గింపు ప్రతిపాదన రూపొందించి బెస్ట్ స్థాయి సమితి ముందుంచి ఆమోదం పొందేలా చేసినట్లు చెప్పారు. దీంతో విద్యార్థులకు చార్జీల భారం నుంచి ఊరట లభించినట్లయింది.