తిరుమల తరహాలో మరో ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ | YSRCP Government Steps To Develop Srikalahasti On A Tirumala Style | Sakshi
Sakshi News home page

తిరుమల తరహాలో శ్రీకాళహస్తిని అభివృద్ధి చేసేందుకు అడుగులు

Published Wed, Aug 28 2019 10:19 AM | Last Updated on Wed, Aug 28 2019 10:19 AM

YSRCP Government Steps To Develop Srikalahasti On A Tirumala Style - Sakshi

ముక్కంటీశుడు మురిసేలా.. ఆధ్యాత్మిక ఆనందంతో భక్తులు విహరించేలా దక్షిణ కైలాసంలో మాస్టర్‌ ప్లాన్‌ అమలవుతోంది. శ్రీకాళహస్తిని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్న మాస్టర్‌ ప్లాన్‌ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌ సంకల్పించారు. స్వర్ణముఖి నది నుంచి భక్త కన్నప్ప కొండ వరకు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారు. సుందరీకరణతో పాటు రోడ్డుకు ఇరువైపులా వాకింగ్‌ ట్రాక్, స్వర్ణముఖి నదికి ఇరువైపులా ఉద్యానవనాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. 

సాక్షి, తిరుపతి: తిరుమల తరహాలో శ్రీకాళహస్తిలో మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చించాలని భావించింది. అందులో భాగంగా ముక్కంటి ఆలయానికి పక్కనే ఉన్న సన్నిధి వీధిలోని 3.90 ఎకరాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్థలంలో మొదటి విడతగా 212 నిర్మాణాలను సేకరించి.. వాటిని తొలగించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. స్థల సేకరణకు రూ.99 కోట్లు కేటాయించారు. మొదటి విడతలో 186 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. మరో 26 మందికి పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందులో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ స్థలాలకు, నిర్మాణాలకు సరైన ధర చెల్లించకుండా.. నిర్వాసితులకు న్యాయం చేయకుండా స్థలాలు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

మాస్టర్‌ ప్లాన్‌కు తెలుగు తమ్ముళ్ల అడ్డు
శ్రీకాళహస్తీశ్వర ఆలయ బృహత్తర ప్రణాళిక పనులకు గత ఏడాది మార్చిలో శ్రీకారం చుట్టారు. ఆరు మాసాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొందరు స్థానికులు, వ్యాపారులు పరిహారం పెంచకపోతే స్థలాలు ఖాళీ చెయ్యమని తేల్చిచెప్పారు. టీడీపీ నేతలు వారిని బెదిరించి బలవంతంగా ఖాళీ చేయించారు. సామాన్యులను ఖాళీ చేయించారు గానీ టీడీపీ నాయకుల వ్యాపార సముదాయాలు, భవనాలను తొలగించలేదు. వారు తమకు మాత్రం పరిహారం అదనంగా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానికులను ఖాళీ చెయ్యించే విషయంలో కీలకంగా వ్యవహరించిన స్థానిక టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పార్థసారథి మాత్రం సన్నిధివీధిలో భిక్షాల గాలిగోపురం వద్ద తన స్థలాన్ని ఖాళీ చెయ్యకపోగా అందులో ఏకంగా బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. టీడీపీ నేతల మోసపూరిత మాటలు నమ్మి ఖాళీచేసిన సామాన్యులు తెలుగు తమ్ముళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త శ్రీకాళహస్తిలో మాస్టర్‌ ప్లాన్‌పై పలుమార్లు సమీక్షించారు. మాస్టర్‌ ప్లాన్‌ నిర్వాసితుల సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. 

ప్రత్యేక ఆకర్షణగా శ్రీకాళహస్తి
మాస్టర్‌ ప్లాన్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి శ్రీకాళహస్తి ఆలయం, స్వర్ణముఖి నది సుందరీకరణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు అవసరమైన గదుల కొరత లేకుండా నిర్మించాలని నిర్ణయించారు. తిరుమల తరహాలో ఉచిత అన్నప్రసాదం అందివ్వనున్నారు. ఆలయం నుంచి అర్థనారీశ్వరాలయం వరకు రహదారి, రోడ్డుకు ఇరువైపుల వాకింగ్‌ ట్రాక్, ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చెయ్యనున్నారు. శ్రీకాళహస్తికి ప్రత్యేక ఆకర్షణగా భక్తకన్నప్ప తిప్పపై వంద అడుగులతో స్వామి, అమ్మవార్ల విగ్రహాలు ఏర్పాటు చేయదలిచారు. శ్రీకాళహస్తిలో నిర్వహించే కొండు చుట్టుకు ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని కొండ చుట్టూ పూలమొక్కలు, విగ్రహాల ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాళహస్తి పేరు చెబితే గుర్తుకు వచ్చే స్వర్ణముఖి నదిని ప్రక్షాళన చేసే దిశగా ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నారు. రెండు కి.మీ పరిధిలోని స్వర్ణముఖి నదికి ఇరువైపులా పూల మొక్కలు, వాకింగ్‌ ట్రాక్‌లు, భక్తులకు ఘట్టాలు నిర్మించనున్నారు. స్వర్ణముఖి నదిలోని మురికి నీటిని శుభ్రం చేసేందుకు వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయదలిచారు. శుద్ధి చేసిన నీటిని పట్టణ అవసరాలకు, వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌ పూర్తయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పేరొస్తుందని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఎవరు అడ్డుపడినా మాస్టర్‌ ప్లాన్‌ అమలుచేసి తీరుతామని ఎమ్మెల్యే స్పష్టంచేశారు.

మాస్టర్‌ ప్లాన్‌ ముందుకే
శ్రీకాళహస్తి ఆలయం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గత వారంలో కలెక్టర్, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో మాస్టర్‌ ప్లాన్‌ సమస్యకు దాదాపు పరిష్కారం దొరికింది. త్వరలోనే పనులు ప్రారంభించి ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం. 
– రామస్వామి, కార్యనిర్వహణాధికారి శ్రీకాళహస్తీశ్వరాయలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement