సాక్షి, అమరావతి: మెరుగైన సమాజం వెనుక చీకటి రాజ్యం నడుపుతున్న టీవీ–9 రవిప్రకాశ్ దశాబ్దిన్నర కాలంలో చేసిన అక్రమాల జాబితా గురించి రాస్తే ఒక పెద్ద గ్రంధమే అవుతుందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి గురువారం పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. టీవీ9తో తెలుగు జర్నలిజంలో నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన రవి ప్రకాశ్‌కు అంతే చీకటి చరిత్ర కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలుసు. గత ఏడాది టీవీ9లో 90 శాతం వాటాలను శ్రీనిరాజు విక్రయించినప్పటి నుంచి రవిప్రకాశ్ ‘మెరుగైన జీవితం’లో చీకట్లు మొదలయ్యాయి. అతని చీకటి సామ్రాజ్యం గుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ఆరంభమైంది.
చంద్రబాబుకు అండగా....
చంద్రబాబు చిరకాలం అధికారంలో కొనసాగేందుకు టీవీ9 తెర ముందు శివాజీ, తెర వెనుక రవిప్రకాశ్ తమ పాత్రలను శక్తి వంచన లేకుండా పోషిస్తూ వచ్చారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే వీరిద్దరూ వైఎస్సార్‌సీపీ పైనా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైనా టీవీ9 ద్వారా విషం కక్కుతూ, గరుడ పురాణాలు ప్రసారం చేస్తూ వచ్చారు. వారి పాపం బద్దలై వారి రహస్య బంధం కూడా బట్టబయలైంది. రవిప్రకాశ్ టీవీ9లోని తన వాటాల్లో కొన్ని తనకు అమ్మి ఆ షేర్లు బదలాయించకుండా మోసం చేశారంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని శివాజీ ఆశ్రయించి మరో పెద్ద నాటకానికి తెర తీశాడు. షేర్ల కొనుగోలు కోసం వీళ్ళద్దరూ ఒక తెల్ల కాగితంపై ఒప్పందం రాసుకుని ఏడాది తరువాత బదిలీ విషయం చూసుకుందాం అని అనుకున్నారంటేనే ఎంత హంబగ్గో అర్థం చేసుకోవచ్చు.
టీవీ–9 పెత్తనం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళకుండా కుట్ర...
టీవీ9పై పెత్తనం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళకుండా ఆపేందుకే ఏడాది క్రితమే పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని రవిప్రకాశ్ రంగంలోకి దింపాడు. ఈ వ్యూహ రచన అంతా అమరావతిలోని కరకట్టపైనే జరిగింది. ఆమేరకే శివాజీ ఎన్సీఎల్‌టీలో తన షేర్ల పురాణం విప్పాడు. టీవీ9పై పెత్తనం రవిప్రకాశ్ చేతుల్లోంచి జారిపోతే అది రాజకీయంగా తమకు తీరని నష్టం జరుగుతుందన్న భయంతో దీన్ని ఒక లీగల్ సమస్యగా మార్చి యాజమాన్య మార్పును అడ్డుకోవడానికి శివాజీ లాంటి కేరెక్టర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ‘మెరుగైన సమాజం కోసం, కులం గోడలు కూల్చేద్దాం’ అంటూ గొప్ప ఆదర్శాలను వల్లిస్తూ ఒక సాదాసీదా జర్నలిస్టు బుల్లి తెరపై దూసుకువచ్చినపుడు సమాజం ఆశగా అతనిని అక్కున చేర్చుకుంది. అదే జర్నలిస్టు ఆ ఆదర్శాలను తుంగలో తొక్కేసి, అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ, బలవంతపు వసూళ్ళకు నడుం కట్టినపుడు సమాజం సిగ్గుతో తలవంచుకుంది. కులం గోడలు కూల్చడానికి బదులుగా తానే కులం రొచ్చులో పీకల వరకు మునిగిపోయాడు. చంద్రబాబు నాయుడే ఆదర్శంగా జర్నలిజంలో విలువలు, సంప్రదాయాలను అధఃపాతాళానికి దిగజార్చాడు. అతి తక్కువ కాలంలోనే వందల కోట్లకు పడగలెత్తాడు. అక్రమంగా ఆర్జించిన వందల కోట్లను విదేశాల్లో ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో పెట్టుబడులుగా పెట్టాడు. ఆ ఆదర్శవాది ఇప్పుడు జైలు గోడలు తప్పించుకోవడానికి పోలీసులకు దొరక్కుండా చంద్రబాబు అండతో అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయాడు.
నిధులు కాజేసి, ఫోర్జరీ పత్రాలు సృష్టించి....
రవిప్రకాశ్ భాగోతంపై బ్రేకింగ్ న్యూస్ నిజానికి నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయన రహస్య మిత్రుడు, చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ ‘గరుడ పురాణం’ శివాజీ ఇంట్లో కూడా సోదాలు చేయడం కొంత ఆసక్తికరంగా అనిపించింది. రవిప్రకాశ్, ‘శుంఠ’ శివాజీల మధ్య బంధం ఈనాటిది కాదు. వారి రహస్య మైత్రి వెనుక బలమైన ఒక రాజకీయ అజెండా ఉందన్న మా అనుమానం తిరుగులేని సత్యమని ఈ ఉదంతం «ధృవపరుస్తోంది.
రవి ప్రకాశ్ సంపాదన వందల కోట్లు దాటింది...
టీవీ9ను అడ్డు పెట్టుకుని రవిప్రకాశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బ్లాక్‌మెయిల్ చేసి కూడబెట్టిన సంపాదనే వందల కోట్లు దాటిపోయింది. ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయన రవిప్రకాశ్ బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంది.
సత్యం రామలింగరాజును బ్లాక్‌మెయిల్ చేసి కోట్లు కొట్టేశాడు
ట్విట్టర్లో విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి
రవిప్రకాశ్ వంటి చీడపురుగుల వల్ల తెలుగు మీడియా ప్రతిష్ట మసకబారిందని విజయసాయిరెడ్డి ట్విటర్లో్ల విమర్శించారు. ప్రవక్తలాగా చెలరేగిన రవిప్రకాశ్ చేయని దుర్మార్గాలు లేవని, మతాలను కించపర్చడం, కార్పొరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టీవీ స్క్రీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడన్నారు. చివరకు టీవీ9 ప్రధాన పెట్టుబడిదారుడు శ్రీనిరాజు సంస్థలో పనిచేస్తూ అతని తోడల్లుడు సత్యం రామలింగరాజును కూడా బ్లాక్‌మెయిల్ చేసి రూ. కోట్లు వసూలు చేశాడంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. రామలింగరాజు బెయిల్ రావడానికి ముందు చికిత్సకోసం నిమ్స్ హాస్పిటల్‌లో చేరితే ఆయన సెల్‌ఫోన్లో మాట్లాడుతుండగా స్పై కెమెరాతో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడని చెపుతుంటారు. అలాగే ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకున్నాడన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు జరగాలి. చివరకు టీవీ9 స్టిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనాన్ని తరలించారని, ఇలా రూ. లక్షల కోట్ల ఎర్రచందనం తరలిపోవడంలో రవిప్రకాశ్ హస్తం ఉండటం దారుణమన్నారు. సినిమాల్లో వేషాల్లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలన్నారు. శివాజీ గరుడ పురాణం ఒక కుట్ర అని ఆయన అమరావతిలో భూములు, హైదరాబాద్‌లో ఆస్తులు ఎలా కొన్నాడు అన్న విషయం బయటకు రావాలన్నారు. తెలుగు మీడియా వీళ్ల బారినుంచి బయట పడితే మళ్లీ 1980ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందన్నారు. మెరుగైన సమాజం కోసం ‘చెమటలు’ కక్కిన రవిప్రకాశ్.. పోలీసులకు లొంగిపోయి సహకరించాలని పౌర సమాజం కోరుతోందన్నారు.
మరిన్ని బ్రేకింగ్‌లు..
►టీవీ9పై రవిప్రకాశ్ పెత్తనం కొనసాగించమని చంద్రబాబుతోపాటు ఆయన అనుచరగణం (గూండాలు) కొత్త యాజమాన్యాన్ని తీవ్రస్థాయిలో బెదిరించారు.
►టీవీ9 రాబడిని, నిధులను సీఈవోగా రవి ప్రకాశ్ భారీ ఎత్తున అక్రమ మార్గంలో తన సొంత ఖాతాలకు మళ్ళించుకున్నట్లు కొత్త యాజమాన్యం చేసిన ఆడిట్‌లో వెల్లడైంది.
►ఇటీవల ప్రారంభించిన భారత్ వర్ష్ హిందీ జాతీయ చానల్ విషయంలోనూ రవి ప్రకాశ్ కొన్ని నిధులు స్వాహా చేసినట్లు వెల్లడైంది.
► టీవీ9పై తన పెత్తనం యధాప్రకారం కొనసాగేందుకు రాజకీయంగా కూడా రవిప్రకాశ్ పావులు కదిపాడు.
Comments
Please login to add a commentAdd a comment