అమరావతి: ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాల్ రెడ్డి గెలుపుపై వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం వైఎస్‌ఆర్ ఎల్పీ సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్ధి వెన్నపూస గోపాల్ రెడ్డి విజయంతోపాటు...మూడు చోట్ల వైఎస్‌ఆర్ సీపీ మద్దతు ఇచ్చిన పీడీపీ అభ్యర్ధులు గెలవడంతో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అమరావతిలో వైఎస్‌ఆర్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ అధినేతతో పాటు ఇతర నేతలు స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజమైన ప్రజా తీర్పు అని నేతలు అభివర్ణించారు.
ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించారు. ప్రజాక్షేత్రంలో వైఎస్‌ఆర్ సీపీనే విజయం సాధించిందని వైఎస్ జగన్ అన్నారు. గోపాల్ రెడ్డికి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. కాగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.