
నెల్లూరు(సెంట్రల్): వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని టీడీపీ నాయకులు నేరుగా తిట్టుకోవచ్చని, ఈ విషయంలో మా నేతపై అభాండాలు వేస్తే ఊరుకోమని వెంకటాచలం మండల జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య అన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సోమిరెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలపై కాకాణి ప్రశ్నిస్తున్నారని, అంతేతప్ప మంత్రిని ఆయన తిట్టారని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రిని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నేరుగా తిట్టకోవచ్చని చెప్పారు. మంత్రి, ఆయన కుమారుడు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో వెలుగులోకి వస్తున్నాయన్నారు. సోమిరెడ్డికి చెందిన సూట్‌కేస్ కంపెనీ బండారం కూడా బయటపడబోతోందన్నారు. నుడా చైర్మన్ నెల్లూరులో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చడవడం మాని సర్వేపల్లిలో విచారిస్తే తండ్రీకొడుకుల బాగోతం తెలుస్తుందన్నారు.
మంత్రి అండతో గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తున్న విషయం వాస్తవం కాదా?, మిల్లర్ల వద్ద రూ.50 కోట్లు తీసుకుని రైతులకు మద్దతు ధర లేకుండా చేసింది వాస్తవం కాదా?, నీరు – చెట్టు పథకంలో అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తేల్చుకోవడానికి బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో నెల్లూరు శివప్రసాద్, చిరంజీవులుగౌడ్, ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, చీకుర్తి నర్సయ్య పాల్గొన్నారు.