![YSRCP leaders Fires On ABN Radha Krishna - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/23/11.jpg.webp?itok=xrbgE3rt)
సాక్షి నెట్‌వర్క్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా కాకుండానే రికార్డు స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతుండటాన్ని చూసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కడుపు మండుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలు రాసిన ఆ పత్రిక యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సవ్యంగా ముగుస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. తన ఐదేళ్ల కాలంలో ఉద్యోగాలను భర్తీ చేయక నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిన బాబును వేనకేసుకొస్తూ.. ఇప్పుడు తప్పుడు ప్రచారంతో వారి ద్వారా ఆయనకు రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆదివారం వారు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పిచ్చి రాతలు రాస్తే ప్రజలు తరిమి కొడతారు
జాతిపిత మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం వైఎస్‌జగన్ ద్వారా సాధ్యమవుతుంటే ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలలో అక్రమాలు జరిగాయని ఆ పత్రిక తప్పుడు కథనాలు రాస్తే.. దాని ఆధారంగా చంద్రబాబు ఏపీ సీఎంకు బరితెగింపు లేఖ రాశారని మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విశాఖ పార్టీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోటీ పరీక్షలు నిర్వహించే ఏపీపీఎస్‌సీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి అనితమ్మకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంలో తప్పేంటని ప్రశ్నించారు. తప్పుడు కథనాలు ప్రచురించిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. గత ఐదేళ్లలో బాబు బాగోతాల గురించి ఏనాడైనా ప్రశ్నించారా అని రాధాకృష్ణను నిలదీశారు. ఇష్టమొచ్చినట్టు పిచ్చి పిచ్చి రాతలు రాస్తే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. తుపాన్ల పేరుతో సేకరించిన చరిత్ర రాధాకృష్ణదని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి పేరును చంద్రజ్యోతిగా మార్చుకోవాలని హితవు పలికారు.
అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం
ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతి కోల్పోయిన చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, అందుకు ఆంధ్రజ్యోతి పత్రిక వంతపాడుతోందని అనంతపురం జిల్లా హిందూపురంలో మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. చంద్రబాబునాయుడు తన అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుంటూరు జిల్లా నరసరావుపేటలో విమర్శించారు. అక్రమాలు, లాబీయింగ్ ద్వారా ఏ ఒక్కరికీ ఉద్యోగాలు లభించలేదన్నారు. ఏపీపీఎస్‌సీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉండాలనే నిబంధన ఎక్కడాలేదన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో పేపర్ లీకైందంటూ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. పేపర్ లీకు ద్వారా ఉద్యోగం దక్కించుకుందని ప్రచారం చేస్తున్న బీసీ మహిళ అనిత భర్త ఎంతోమందికి ఉద్యోగాల కోసం పదేళ్ల నుంచి శిక్షణ ఇస్తున్నారన్నారు. ప్రముఖ హిందీ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో ఒక వంటమనిషి రూ.కోటి గెల్చుకున్నారని గుర్తు చేశారు. కాగా, ఆంధ్రజ్యోతి పత్రికపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు కడపలో డిమాండ్ చేశారు.
రికార్డు స్థాయి ఉద్యోగాల భర్తీని జీర్ణించుకోలేకే..
రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీని మాజీ సీఎం చంద్రబాబు, ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్ అధిపతి వేమూరి రాధాకృష్ణలు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేపర్ ఎక్కడ లీకయిందో రాధాకృష్ణ చెప్పాలని, అందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో కలిసి రేపోమాపో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్ దగ్గరకు వెళ్తామని చెప్పారు. ప్రచురించిన కథనాలను నిరూపించకలేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని పేదల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
రాధాకృష్ణ అకృత్యాలపై దళితులు గొంతువిప్పాలి
కులాల మధ్య చిచ్చుపెట్టే ఏబీఎన్ రాధాకృష్ణ అకృత్యాలపై రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనులు గొంతు విప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్‌లో వార్తలు ప్రసారంచేసి దళితులను కించపరిచాయన్నారు. రాధాకృష్ణ అకృత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన విచారణకు ఆదేశించాలని కోరారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటే దానిని వక్రీకరించి కథనాలు
ఇవ్వడంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
తప్పుడు వార్తలతో పబ్బం గడుపుకుంటారా?
పత్రికను అడ్డం పెట్టుకొని భూ దందాలు, పంచాయితీలు చేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వందల కోట్లు వెనకేసుకున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2009 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత వచ్చిన ప్రకటనలు, అక్రమాలు, భూ దందాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు వార్తలతో పబ్బం గడుపుకోవడమే ఆ పత్రిక దిన చర్య అని ధ్వజమెత్తారు. బాబు తప్ప మరొకరు సీఎంగా ఉండకూడదా.. అని ప్రశ్నించారు. ప్రస్తుత నియామకాల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు అత్యధికంగా లబ్ధిపొందుతుంటే ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
వేమూరి రాధాకృష్ణపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
తాడిపత్రి: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసి, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వారిలో అలజడి సృష్టించేలా రాతలు రాసిన ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తాడిపత్రిలో డీఎస్పీ శ్రీనివాసులుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment