
వేధిస్తే ఊరుకోం
జమ్మలమడుగు: అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని తమ కార్యకర్తలతో పాటు ఇతరులకు అన్యాయం చేస్తే ఊరుకోమని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీవరకు ఉద్యమిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సి. ఆదినారాయణరెడ్డి,రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, జయరాములు, కొరముట్ల శ్రీనివాసులు,ఆంజాద్‌బాష, ఎమ్మెల్సీదేవగుడినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి ఆమరనాథరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ సురేష్‌బాబు సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
రేషన్‌షాపులను నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తొలగిస్తుండడం అన్యాయమన్నారు. అధికారంలోకి వచ్చి నెలరోజులు కాకమునుపే టీడీపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడటం హేయమన్నారు. చిన్న చిన్న ఉద్యోగుల కడుపులు కొట్టే కార్యక్రమం మంచిది కాదన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజలను నమ్మించి మోసగించడం టీడీపీకి మాత్రమే చెల్లిందన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇందుకు అధికారులు కూడా సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని శాశ్వతంగా ఉండేది ఉద్యోగులేనని.. అటువంటి వారు న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి తమ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోమన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ధర్నాలో డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్‌లు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ముక్తియార్. మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి, శివనారాయణరెడ్డి, జానకీరామిరెడ్డి, అంకిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకుడు కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.