సాక్షి, అమరావతి: తనిఖీల పేరుతో మార్షల్స్ తమపై దాడులు చేస్తున్నారని, ఇలాగైతే సభకు ఎలా వస్తామంటూ టీడీపీ సభ్యులు.. మార్షల్స్‌పై టీడీపీ సభ్యులే దాడి చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు వాదోపవాదాలకు దిగడంతో శాసన మండలి శుక్రవారం దద్దరిల్లింది. సభ్యులను ఆపి తనిఖీలు చేయకూడదని చైర్మన్ హోదాలో అహ్మద్ షరీఫ్ చీఫ్ మార్షల్‌కు రూలింగ్ ఇచ్చినా పరిగణనలోకి తీసుకోకుండా శుక్రవారం కూడా మార్షల్స్ అదే ధోరణి అవలంబించారంటూ టీడీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళనకు దిగారు. తనిఖీల పేరిట మార్షల్స్ దాడులకు పాల్పడినట్లు తమ వద్ద వీడియో క్లిప్పింగ్‌లున్నాయని, వాటిని సభలో ప్రదర్శించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ సభ్యులు కోరిన విధంగా వారిచ్చిన వీడియో క్లిప్పింగ్‌లను సభలో ప్రదర్శించేందుకు అనుమతిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
ఆ క్లిప్పింగ్‌ను ఎలా అనుమతిస్తారు: బొత్స
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సభ్యులు ఇచి్చన వీడియో క్లిప్పింగ్‌లను సభలో ప్రదర్శించేందుకు ఎలా అనుమతి ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త సంప్రదాయం తీసుకురావడం మంచిది కాదని, సభా ప్రాంగణంలో అధికారికంగా తీసిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. పీడీఎఫ్ సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సభ్యులు ఇచి్చన వీడియో, సభా ప్రాంగణంలో అధికారికంగా తీసిన వీడియోలను వేర్వేరుగా ప్రదర్శించి సభ్యులపై మార్షల్స్ దాడి చేసినట్లు ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
రెండు క్లిప్పింగ్‌లను ప్రదర్శించేందుకు అనుమతిస్తున్నట్లు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ టీడీపీ సభ్యులు మార్షల్స్‌పై దాడి చేసినట్లు స్పష్టంగా వీడియో క్లిప్పింగ్‌లున్నాయని, సభా ప్రాంగణంలో మార్షల్స్‌పై జరిగిన దాడిని అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లపై దాడిగా భావించాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించకుండా అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు ఎత్తుగడ వేశారన్నారు.
సంతృప్తి చెందాకే ‘మండలి’లో ప్రదర్శన
ఎమ్మెల్సీలు, మార్షల్స్ మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి ఏ వీడియోనైనా శాసనమండలిలో ప్రదర్శించటానికి ముందు.. చైర్మన్ చాంబర్‌లో వాటిని చూసి, సంతృప్తి చెందాకే నిర్ణయం తెలియజేస్తామని చైర్మన్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రూలింగ్ ఇచ్చారు. మార్షల్స్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు కొన్ని వీడియోలు ఇచ్చి, వాటిని సభలో ప్రదర్శించాలని, సభ్యుల హక్కులను, గౌరవ మర్యాదలను కాపాడాలని నినాదాలు చేస్తూ సభలో ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment