సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంటివద్దకే పింఛన్ల పంపిణీ అద్భుతమైన ఫలితాలనిస్తోందన్నారు. పటిష్టమైన గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ తీసుకువచ్చారన్నారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగిందని.. మధ్యాహ్నానికే 80 శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇవాళ ఆదివారమైనా లబ్ధిదారులకు పింఛన్లు అందాయని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతుంది..
వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. అవినీతికి తావులేకుండా సీఎం జగన్ పటిష్టమైన వ్యవస్థను నిర్మించారని తెలిపారు. ఏపీలో నిజమైన ప్రజా పరిపాలన సాగుతోందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతుందని చెప్పారు. కియా మోటార్ వెళ్ళిపోతోందని టీడీపీ గందరగోళం సృష్టించిందని మండిపడ్డారు. పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయంటూ చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రిని కలవడం శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు. (పింఛన్ల పంపిణీలో ఏపీ సర్కార్ రికార్డ్)
రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదా..?
రాజధాని ప్రాంతంలో పేదలకు భూమి ఇస్తే దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని రాంబాబు మండిపడ్డారు. ‘‘రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట. టీడీపీకి చెందిన వారు, ధనవంతులు మాత్రమే రాజధాని ప్రాంతాల్లో ఉండాలా.. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదా? ఎప్పుడైనా పేదవాడికి సెంటు భూమిచ్చారా.. చాలా దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు’’ అని అంబటి దుయ్యబట్టారు. మేం ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. కులాలు, ప్రాంతాలు మధ్య చిచ్చుపెట్టేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మూడు గ్రామాల ప్రజలకు నేతగా మిగిలిపోయారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment