చంద్రబాబూ.. మీ జేబులు నింపుకోవడానికా?
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించాలని పార్టీలు, యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాలవారు కోరుకుంటుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవం రోజున ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. చంద్రబాబు సీనియర్ నాయకుడిగా ఉండి ఇలా వ్యవహరించడం దారుణమని ఆమె అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నం ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనకుండా పోలీసులు నాయకులను, ప్రజలను అడ్డుకోవడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో బీజేపీ నేత వెంకయ్య నాయుడుతో కలిసి ప్రచారంలో పాల్గొంటూ.. ప్రత్యేక హోదా సాధిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయలేమని ప్రగల్భాలు పలకలేదా? మేనిఫెస్టోలో రాయలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షాల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు రెండున్నరేళ్లుగా పోరాడుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో రెండుసార్లు హోదా కోసం తీర్మానం చేయలేదా అని ప్రశ్నించారు. అలాంటిది చంద్రబాబు ప్యాకేజీని ఎందుకు అంగీకరించారని, మీ జేబులు నింపుకోవడానికా అని మండిపడ్డారు. గిరిజనులకు ఏం సాధించిపెట్టారని చంద్రబాబును నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం ప్రజలంతా ఉద్యమరూపంలోకి వచ్చారని, శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని గిడ్డి ఈశ్వరి చెప్పారు.