వైఎస్ జగన్ ఆదేశిస్తే.. రాజీనామాకు సిద్ధం
తిరుపతి: ప్రత్యేక హోదా కోసం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే.. రాజీనామాకు పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, రాజకీయ ప్రయోజనాలు కాదు.. రాష్ట్ర అభివృద్థే ముఖ్యమన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలు చేశారు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చిందో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చి వుంటే రాష్ట్రం ఎంతో లబ్ది పొందేదని, ప్యాకేజీ వల్ల ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించారు.
శాంతియుతంగా చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ పట్ల ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేసుల భయం వల్లే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వీడి అమరావతికి చంద్రబాబు మకాం మార్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను సీఎ చంద్రబాబు కేంద్రం ముందు తాకట్టు పెట్టాడని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మట్టి, ఇసుక అమ్ముకుంటున్నారు.. రైతులు భూములు లాక్కుంటున్న సీఎంకు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.