
సాక్షి, పశ్చిమ గోదావరి : భీమవరంలో మంచినీటి సమస్యపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భీమవరంలో ప్రజలు మంచి నీటికోసం చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపల్ పాలకులు మంచినీటి వ్యాపారం చేయటమే ఇందుకు కారణమన్నారు. ప్రజలు త్రాగవలసిన మంచినీటిని విచ్చలవిడిగా రొయ్యల ఫ్యాక్టరీలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. వాటర్ హెడ్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు దగ్గర పెట్టిన సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి దోపిడీ చేశారన్నారు.
అమృత పథకం అని మొదలు పెట్టి, ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. అమృత పథకం పేరు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా, క్వాలిటీ లేకుండా పైపులైన్లు వేయడానికి రోడ్లు తవ్వి పడేశారని, రోడ్లను చిధ్రం చేశారని మండిపడ్డారు. పైపులైన్‌లు వేసి దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదన్నారు.