‘ఐటీ నోటీసుల అంశాన్ని దృష్టి మరల్చేందుకే బాబు అరాచకం’ | MLA Grandhi Srinivas Comments On Chandrababu And Lokesh - Sakshi
Sakshi News home page

‘ఐటీ నోటీసుల అంశాన్ని దృష్టి మరల్చేందుకే బాబు అరాచకం’

Published Wed, Sep 6 2023 11:09 AM

Mla Grandhi Srinivas Comments On Chandrababu And Lokesh - Sakshi

సాక్షి, భీమవరం: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడమే చంద్రబాబు లక్ష్యమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐటీ నోటీసుల అంశాన్ని దృష్టి మరల్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని, పుంగనూరులో చేసిన అరాచకాన్నే భీమవరంలో చేశారని దుయ్యబట్టారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకే..
ఎంత ప్రయత్నించినా తన పాదయాత్రకు ఎలాంటి స్పందన లేకపోవటం, మరోవైపు తండ్రి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులతో దిక్కుతోచక ఉక్కిరి బిక్కిరి అవుతున్న లోకేశ్, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. తాజాగా ఉంగుటూరులో టీడీపీ గుండాలు చేసిన అరాచకాలు అందరూ చూశారు.

సంయమనం పాటించాం
లోకేశ్‌ పాదయాత్రతో రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలు మా పార్టీ ఫ్లెక్సీ చింపేసినా, మేం సంయమనం పాటించాం. పూర్తి సహనంతో ఉన్నాం. భీమవరంలో మా పార్టీ ఆరు నెలల క్రితం పేదలకు, పెత్తందారులకు పోరాటం పేరుతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. భీమవరంలోకి లోకేశ్‌ ప్రవేశానికి ఒక రోజు ముందు టీడీపీ గూండాలు ఆ ఫ్లెక్సీపై రాళ్లు వేశారు. చింపేశారు. అందుకు ఈ పోటోనే సాక్ష్యం.. అంటూ ఒక ఫోటో చూపారు. ఆ విధంగా శాంతిభద్రతల సమస్యలు çసృష్టించి మమ్మల్ని రెచ్చగొట్టాలని టీడీపీ ప్రయత్నం చేసినా, మేం పూర్తి సంయమనం పాటించాం. నిజానికి మేం తల్చుకుంటే టీడీపీకి చెందిన ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండేది కాదు. 

లోకేశ్‌ నోరు అదుపులో పెట్టుకో
భీమవరం ప్రజల మనస్సు గెలిచి నేను ఎమ్మెల్యేను అయ్యాను. నీలా దొడ్డిదారిన ఎమ్మెల్సీని అయి, మంత్రి పదవి చేపట్టలేదు. మా ఫ్లెక్సీ చింపేసినా, మేము మౌనంగా ఉండడం లోకేశ్‌కు మింగుడు పడలేదు. దీంతో మాటలు, అసభ్య పదజాలంతో మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను గజదొంగ, క్యాన్సర్‌ గడ్డ అంటూ లోకేశ్‌ నోరు పారేసుకున్నాడు. లోకేశ్‌ ఇకనైనా తగ్గు. నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.

అవెక్కడున్నాయో చూపాలి
భీమవరంలో లోకేశ్‌ పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్‌. యాత్రకు ఎక్కడా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. పట్టుమని 500 మంది కూడా యాత్రలో పాల్గొనలేదు. దీంతో వేర్వేరు ప్రాంతాల నుంచి డబ్బులతో జనాన్ని పోగేశారు. అయినా, స్థానిక ప్రజలు పట్టించుకోకపోవడంతో.. నేను గజదొంగనని, అవినీతి పరుడ్ని అని, రూ.52 కోట్లు దోచుకున్నానని, వంద ఎకరాల భూమిని ఆక్రమించుకున్నానని, ఇంకా  భూదందాలు చేస్తున్నానని లోకేశ్‌ పిచ్చిపిచ్చిగా వాగాడు. రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నట్లు లోకేశ్‌ పప్పు మాత్రమే కాదు. అతడొక సన్నాసి.

నీవు ఆరోపించిన ఆ రూ.52 కోట్లు, 100 ఎకరాల భూమి ఎక్కడున్నాయో చూపించు. నేను లోకేశ్‌ మాదిరిగా అడ్డగోలు సంపాదనతో కాకుండా, అప్పు చేసి స్థలాలు కొన్నాను. ఈరోజు లోకేశ్‌ పక్కన కూర్చున్న చాలా మంది దొంగనోట్ల మార్పిడి చేసి కోట్లు సంపాదించారు. ఈ విషయం భీమవరంలో చాలా మందికి తెలుసు. ఎవడు రాసిచ్చాడో తెలియదు కానీ.. లోకేశ్‌ నాపై పిచ్చి ఆరోపణలు చేశాడు. ఆ రూ. 52 కోట్లు ఎక్కడున్నాయో లోకేశ్‌ చెబితే, ఆయన ఫోటోకు దండేసి, రెండు అరటిపళ్లు, నాలుగు అగరబత్తులతో దండం పెట్టుకుంటాను. 

బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్నా:
నేను భీమవరంలో ప్యాలెస్‌ కట్టుకుంటున్నానని లోకేశ్‌ ఆరోపించాడు. చంద్రబాబుకు, లోకేశ్‌కు మాత్రమే ఇళ్లు ఉండాలా? మాలాంటి వాళ్లకు ఉండకూడదా? నేను ఉంటున్న ఇళ్లు నాది కాదు. మా తాత మా తమ్ముడికి రాసిచ్చారు. తమ్ముడి ఇంట్లో ఉంటున్నాను. రెండో తమ్ముడు నాకు కొంత భూమి దానంగా ఇస్తే బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను.

వారే అభివృద్ధికి శాపం
నిజానికి ఇక్కడ అభివృద్ధి పనులకు టీడీపీనే ఒక శాపంలా మారింది. ఆ పార్టీ నాయకులే భీమవరం అభివృద్ధికి అడ్డంకులు సృష్టించారు. టీడీపీ నుంచి 5 ఏళ్లు ఎంపీగా (రాజ్యసభ సభ్యురాలిగా) పని చేసిన ఆమె, కనీసం తన ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకోలేక పోయింది. మున్సిపాలిటీలో 10 ఏళ్లు ఆ పార్టీనే అధికారంలో ఉన్నా, ఊరి కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదు. చివరకు ఛైర్మన్‌ కనీసం ఇంటి ముందు కూడా రోడ్డు వేయించుకోలేకపోయాడు. 

భీమవరంలో నీటి సరఫరా కోసం చినమెరం ప్రాంత రైతుల నుంచి భూసేకరణ మొదలుపెడితే టీడీపీ వారే అడ్డుపడ్డారు. ఆ భూములు ప్రభుత్వానికి అప్పగిస్తే.. డబ్బులు రావని టీడీపీ నాయకుడు తన పేరు మీద రాయించుకున్నారు. తర్వాత ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించకుండా భీమవరం మండలానికి తాగునీటి సమస్య వచ్చేలా చేసింది టీడీపీ నాయకుడే.

పట్టణంలో కంపోస్టు యార్డు కోసం 10 ఎకరాలు సేకరిస్తే, ఆ పక్కనే 50 ఎకరాలు తక్కువ ధరకు కొట్టేసిన టీడీపీ నాయకులు, ఆ తర్వాత కోర్టులో కేసు వేసి, కంపోస్టు యార్డు ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డారు. ఇవన్నీ తెలిసినా, లోకేశ్‌ మాత్రం మమ్మల్నే నిందిస్తూ భీమవరంలో కంపోస్టు యార్డు ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించడం సరికాదు.

ఇవీ మేం చేసిన అభివృద్ధి పనులు
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, భీమవరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. కంపోస్టు యార్డు కోసం సేకరించిన భూమి అన్యాక్రాంతమైతే, అందులో 6 ఎకరాల 60 సెంట్లు తిరిగి స్వాధీనం చేసుకున్నాం. 60 ఎకరాల్లో సమ్మర స్టోరేజీ ట్యాంక్‌ ఏర్పాటు చేశాం. టిడ్కో ఇళ్లకు బకాయి పెట్టిపోతే, ఆ సంస్థ పనులు పూర్తి చేయలేదు. దీంతో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మళ్లీ టెండర్లు పిల్చి, పనులు అప్పగించాం. దీని వల్ల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. టిడ్కో ఇళ్లూ పూర్తవుతున్నాయి. నాడు మహానేత వైఎస్‌ఆర్‌ హయాంలో సేకరించిన భూముల్లోనే మా ప్రభుత్వం టిడ్కో ఇళ్లు కడుతోంది. వాటిని పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించబోతున్నాం.

రూ.2 కోట్లతో ఓల్డ్‌ యనమలదుర్ర డ్రైయిన్‌ నిర్మాణం, సోమగుండం ఔట్‌లెట్, సోమగుండం చెరువు అభివృద్ధి చేశాం. తాడేరు బ్రిడ్జిని యుద్దప్రాతిపదికన పూర్తి చేశాం. యనమలదర్రు డ్రైయిన్‌ మీద అప్రోచ్‌ బ్రిడ్జిలకు త్వరలో రూ.32 కోట్లతో టెండర్లు పిలిచి రోడ్లకు అనుసంధానం కార్యక్రమం చేస్తున్నాం. భీమవరానికి జిల్లా కేంద్రాన్ని తెచ్చాం. 

వారే దాడి చేసి.. మాపై ఎదురుదాడి
టీడీపీ గూండాలు ఇళ్లలోకి వెళ్లి వృద్ధులు, మహిళలపై దాడి చేశారు. మా పార్టీకి కంచుకోట అయిన ఇందిరమ్మ కాలనీపై టీడీపీ గూండాలు దాడి చేశారు. మా పార్టీ అభిమానులు జెండాలు పట్టుకుంటే వాటిని లాక్కొని దహనం చేసి.. కాళ్లతో తొక్కి.. వారి ఇళ్లలోకి ప్రవేశించి దాడులకు తెగబడ్డారు. రాళ్లతో దాడులు చేశారంటూ.. ఇలాంటి గులకరాళ్లు ఈ ప్రాంతంలో ఉంటాయా?.. అంటూ వాటిని చూపారు.

వ్యాన్లలో రాళ్ల బస్తాలు పెట్టుకొచ్చిన టీడీపీ గుండాలు, ప్రజల ఇళ్లపై దాడి చేశారంటూ.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వీడియోలు ప్రదర్శించారు.ఆ విధంగా యథేచ్ఛగా దాడి చేసిన టీడీపీ గుండాలు.. మమ్మల్ని నిందిస్తూ, మాపైనే ఎదురుదాడికి దిగారు. ఎప్పుడూ శాంతియుతంగా ఉండే భీమవరంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.

మీడియా అండగా ఉందని..
మీడియా ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? లోకేశ్‌ నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా జిల్లా దాటిపోవు. ఇక ఎల్లో మీడియా కూడా పచ్చిగా వాస్తవాలు వక్రీకరిస్తోంది అంటూ.. తమ పార్టీ ఫ్లెక్సీపై ఎవరు రాళ్లు విసిరి, చింపేశారో చూడండి అంటూ.. ఆ ఫోటోలు చూపిన ఎమ్మెల్యే.. వాళ్లు ఎవరో చెప్పాలని ప్రెస్‌మీట్‌లో ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులను ప్రశ్నించారు.
చదవండి: భీమవరంలో మరో పుంగనూరు..

Advertisement
Advertisement