పేదలపై బాణాలా?: సీఎం జగన్‌ | CM YS Jagan Fires On Chandrababu Naidu And Pawan Kalyan At Bhimavaram Sabha - Sakshi
Sakshi News home page

రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్‌: సీఎం జగన్‌ 

Published Wed, Apr 17 2024 4:44 AM | Last Updated on Wed, Apr 17 2024 11:34 AM

CM YS Jagan Fires On Chandrababu Pawan Kalyan At Bhimavaram Sabha - Sakshi

చంద్రబాబుకు పది మంది సేనానులు.. మీ గురి ఎవరిపై?.. భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌  

ప్రజలకు అందుతున్న పథకాలు, వ్యవస్థలపై బాణాలా?  

నేను ఒక్కడినే కానీ ఒంటరిని కాదు.. నాకు తోడుగా పేదల సైన్యం  

రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్‌ను కోరుకుంటున్నాయి 

రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్‌ 

బాబుకు – అభివృద్ధికి ఏం సంబంధం? అంతా సెల్ఫ్‌ డబ్బా..  

సింగపూర్‌ కట్టాడా? మైక్రోసాఫ్ట్‌ తెచ్చాడా? బుల్లెట్‌ ట్రైను తెచ్చాడా?  

కొత్త పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు తెచ్చాడా? జిల్లాకో హైటెక్‌ సిటీ కనిపించిందా?  

బాబు రిపోర్ట్‌ అంతా బోగస్‌.. మన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ మీరే చూడండి 

కొంగ జపం ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు.. కోపంతో ఊగిపోతున్నారు 

దత్తపుత్రుడు కార్లు, భార్యల మాదిరిగా నియోజకవర్గాలనూ మారుస్తున్నాడు 

నిన్ను మిగతా వాళ్లూ అనుసరిస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి?   

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  ‘‘జగన్‌ ఎప్పుడూ ఒంటరి కాదు.. అందరికీ మంచి చేసిన జగన్‌కు ప్రతి ఇంటా మద్దతు ఉంది. ఏ ఇంట్లో చూసినా తోడుగా పేదల సైన్యం ఉంది. జగనే మళ్లీ రావాలని కోట్ల హృదయాలు ఆశీర్వదిస్తున్నాయి. ఒక్క జగన్‌ మీద చంద్రబాబు 10 మంది సేనానులను తోడు తెచ్చుకుని బాణాలు గురి పెడుతున్నారు. అవి తగిలేది జగన్‌కా? లేక పేదలకా?’’ అనేది ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. 16వ రోజు బస్సు యాత్ర సందర్భంగా మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే..

బాబు గురించి చరిత్ర చెబుతున్న నిజం..
భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది. శబరి, ఇంద్రావతి కలసి ఉప్పొంగిన గోదావరిని తలపి­స్తోంది. మంచి చేసి మనం,  జెండాలు జతకట్టి వాళ్లు తలపడుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? సంక్షేమ రాజ్యాన్ని అబద్ధాలు, కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. మీ ఐదేళ్ల భవిష్యత్తు, అక్కచెల్లెమ్మల సాధికారత, పిల్లల చదువులు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న భరోసా, పేదలకు సామాజిక న్యాయం కొనసాగుతూ మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మోసపోయి మళ్లీ నష్టపోవాలా? అనేది నిర్ణయించే ఎన్నికలు ఇవి.

అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఇవి మన తలరాతలను మార్చే ఎన్నికలు. ఇవి కేవలం చంద్రబాబు – జగన్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు – చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని గుర్తు పెట్టుకోండి. మీ ప్రతి ఓటు వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది కాబట్టి మీ కుటుంబమంతా కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ అంతటితో ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఆయన సాధ్యం కాని అలవిమాలిన హామీలతో వస్తున్నారనేది నిజం. 



కొంగ జపం.. నటిస్తావెందుకయ్యా? 
మీరంతా ఈమధ్య చూసే ఉంటారు. చంద్రబాబుకు నాపై కోపం చాలా ఎక్కువగా వస్తోంది. ఆయన మాట్లాడు­తున్న­ప్పుడు హైబీపీ కనిపిస్తోంది. ఏవేవో తిడుతుంటా­డు.. శాపనార్ధాలు పెడుతుంటాడు. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటూ ఉంటాడు. రాళ్లు వేయండి.. అంతం చేయండని పిలుపునిస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి. అక్కచెల్లెమ్మలూ.. నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకో తెలుసా? బా­బూ.. చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందు­కు ఎదురు చూస్తూ ఇంకోపక్క జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకయ్యా? కొంగ జపాలు ఎందుకు చే­స్తు­న్నావ్‌? అని అడిగా. అలా అడగడం తప్పా? మీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకంగానీ మంచి పనిగానీ ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అని చంద్రబాబును అడిగా. ఆయన పేదలకు చేసింది ఏమీ లేకపోగా చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు, కుట్రలే గుర్తుకొస్తాయి.

భార్యలను వదిలేసి.. నియోజక వర్గాలనూ మార్చేసి!
ఇక దత్తపుత్రుడి విషయానికి వస్తే.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను కూడా పుట్టించి నాలుగైదేళ్లకు ఒకసారి కార్లను మార్చేసినట్లుగా భార్యలను వదిలేసి, ఇప్పుడు నియోజక వర్గాలను కూడా అలవోకగా వదిలేస్తున్నావ్‌! ఏం మనిషివయ్యా నువ్వు? అని ఆయన్ను అడిగా. అందుకే దత్తపుత్రుడిలో కూడా ఈమధ్య బీపీ బాగా కనిపిస్తోంది. ఒకసారి చేస్తే అది పొరపాటు! మళ్లీ మళ్లీ చేస్తే అలవాటు అంటారయ్యా.. దత్తపుత్రా! పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డుపైకి తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపడం ఘోరమైన తప్పుకాదా? ఇదే విషయం నేను అడిగితే తప్పు అట!

నిన్ను చూసి అదే తప్పు ప్రతి ఒక్కరూ చేయడం మొదలుపెడితే.. ఇలా నాలుగేళ్లకు, ఐదేళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? అని కనీసం ఆలోచన కూడా చేయడు. ఆ పెద్దమనిషికి నువ్వు చేస్తున్నది తప్పు అని చెబితే బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఇలా.. ఊగి­పోతుంటాడు. చేతులు, కాళ్లు, తల..అన్నీ ఊపే­స్తుం­టాడు. ఇలా అడిగినందుకే బా­బుకు, దత్తపుత్రుడికి నాపై కోపం. బాబు వదిన గారికి కూడా కోపం వచ్చింది. బాబు భజంత్రీలకు కూడా పిచ్చి కోపం.. వీళ్లంతా ఊగిపోతూ ఈనాడు, ఆంధ్ర­జ్యోతి, టీవీ 5లలో పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు.

పేదలపై బాబు బాణాలు..
జగన్‌ ఒక్కడే.. చంద్రబాబుకు మాత్రం పది మంది సేనానులు. వారంతా బాణాలు గురి పెట్టారు. కానీ అవి తగిలేది ఎవరికి? జగన్‌కా? లేక పేదలకు జగన్‌ అందిస్తున్న పథకాలకా? వలంటీర్లు–సచివా­లయా­ల వ్యవస్థలకా? ఆర్బీకేలు–విలేజ్‌ క్లినిక్స్‌ వ్యవ­స్థలకా? నాడు – నేడు, ఇంగ్లీషు మీడియంతో మారి­న పిల్లల చదువులకా? వారి బాణాలు తగిలేది ఎ­వరికి? ఇంటింటికీ అందించే పెన్షన్లకు వారి బా­ణాలు తగులుతున్నాయి. మీ బిడ్డ బటన్‌ నొక్కడంతో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు పలు పథకాల ద్వారా గత 58 నెలల్లో పేదలకు అందాయి.

మరి వాళ్లు వేసే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? లేక ఆ రూ.2.70 లక్షల కోట్లు అందుకున్న అక్కచె­ల్లె­మ్మల కుటుంబాలకు తగులుతున్నాయో ఆలోచన చేయమని కోరుతున్నా. వారంతా బాణాలు ఎక్కుపెట్టింది మీ అందరి మంచి కోరుతూ మనం తీసుకొచ్చిన వ్యవస్థలపై, పథకాలపై. అక్క చెల్లెమ్మల సాధికారత, పేద బిడ్డల బంగారు భవిష్యత్తు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న రైతు భరోసాపై చంద్రబాబు, ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధమిది. 

పుట్టుకతోనే రొయ్యకు మీసాలు.. బాబుకు మోసాలు
రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతో ఎలా వచ్చాయో భీమవరంలో తేల్చేద్దాం. బాబు వస్తే జాబులు రావడం కాదు.. ఉన్నవి ఎలా ఊడిపో­తాయో, రైతులను ఎలా ముంచాడో మొన్ననే పిడుగురాళ్ల సిద్ధం సభలో చెప్పా. టీడీపీ, ఎల్లో మీడియా చంద్రబాబును జాకీలు, పొక్లెయిన్లతో లేవనెత్తుతూ చేస్తున్న మోసాలు, పచ్చి అబద్ధాల గు­రించి ఇవాళ తేలుద్దాం.

ఆ ప్రచారాల్లో ఎంత నిజం ఉందో చూద్దాం. ఖాళీ డబ్బాలో రాళ్లు వేస్తే డబ­డబ సౌండ్‌ వచ్చిన తరహాలో బాబు వల్లే అభివృద్ధి అంటూ ఊదరగొడుతుంటారు. అసలు బాబుకు – అభివృద్ధికి ఏమైనా సంబంధం ఉందేమో మీరే చెప్పండి. సెల్‌ఫోన్‌ను కనిపెట్టిందీ, సత్య నాదెళ్లను చదివించిందీ తానేనని చెప్పుకునే బాబు పాత డైలాగులు కాసేపు పక్కనబెట్టి మీ అందరికీ బాగా గుర్తున్న 2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పారో చూద్దాం. కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడైన బాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ ఎల్లో గ్యాంగ్‌ డప్పు కొట్టింది. జగన్‌కు అనుభవం లేదు, పిల్లోడని.. బాబుకైతే బాగా అనుభవం ఉంది, ఆయన వస్తేనే అభివృద్ధి అని ఊదరగొట్టారు. 

చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా..
అదిగో హైపర్‌ లూప్‌.. బుల్లెట్‌ రైలు.. మైక్రోసాఫ్ట్‌ వచ్చేసిందని.. ఏపీలో ఒలంపిక్స్‌ అని.. ఆమ్‌స్టర్‌ డ్యామ్, సింగపూర్, వెనిస్‌తో పోటీపడే నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా కొట్టుకోలేదా? మరి సింగపూర్‌ కట్టాడా? హైపర్‌ లూప్‌ తెచ్చాడా? బుల్లెట్‌ రైలు వచ్చిందా? మైక్రోసాఫ్ట్‌ ఏమైనా తెచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలంపిక్స్‌ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులు కట్టాడా? ఫిషింగ్‌ హార్బర్లు కట్టాడా? కనీసం ఎయిర్‌పోర్టులు ఏమైనా కొత్తవి కట్టాడా? జిల్లాకో హైటెక్‌ సిటీ మీకేమైనా కనిపించిందా? ఎక్కడైనా ఓ మెడికల్‌ కాలేజీ కట్టాడా? ఇవన్నీ కట్టకపోతే పోనివ్వండి.

ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ స్కూల్‌ని, కనీసం వార్డునైనా బాగు చేశాడా? ఎక్కడైనా ఒక ఊరిలో సచివాలయం, విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేశాడా? గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్‌ను తెచ్చాడా? మీ ఇంటివద్దకే ఆరోగ్య సురక్ష వచ్చిందా? డిజిటల్‌ లైబ్రరీలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించాడా? రైతన్నకు మేలు చేస్తూ ఆర్బీకే వ్యవస్థను తెచ్చాడా? ఒక వలంటీర్‌ వ్యవ­స్థను తెచ్చాడా? మరి ఇలాంటి బాబు ఏం చేశాడని అభివృద్ధి కింగ్‌ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు? మీదంతా బోగస్‌ రిపోర్టు కాదా? 

మీ జగన్‌ ప్రోగ్రెస్‌ రిపోర్టు..
► వాయువేగంతో ఏకంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీల పనులు 
► కొత్తగా, శరవేగంగా మరో నాలుగు సీ పోర్టుల పనులు 
► కొత్తగా 10 ఫిషింగ్‌ హార్బర్ల పనులు వడివడిగా
► కొత్తగా ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల పనులు
► 15 వేలకుపైగా సచివాలయాల ఏర్పాటు
► నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, ఆస్పత్రులు
► కొత్తగా 15 వేలకుపైగా విలేజ్, వార్డు క్లినిక్స్‌
► కొత్తగా 11 వేలకుపైగా ఆర్బీకేలు
► కొత్తగా ఇప్పటివరకు 3 వేలకుపైగా డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం
► గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్‌ సదుపాయం
► రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడుల రాక
► విమానాశ్రయాల విస్తరణ, వాయువేగంతో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు
► 3 ఇండస్ట్రియల్‌ కారిడార్లు, ఇండస్ట్రియల్‌ నోడ్స్, ఎంఎస్‌ఎంఈలకు ఆపన్న హస్తం
► స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, మత్స్యకార భరోసా, చేదోడు, తోడు, నేతన్ననేస్తం, 
► దేశంలో అభివృద్ధిలో టాప్‌ 5 రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్‌
► ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటివద్దకే పథకాలు, సేవలు

 2014లో బాబు మోసాలిలా..
రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాడా?రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం  కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తామన్నాడు. ఎవరికైనా చేశాడా? ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, ఇల్లు కూడా ఇస్తామన్నాడు.

ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలు మాఫీ అన్నాడు. మరి చేశాడా? ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామని నమ్మబలికిన బాబు చేశాడా? ప్రతి నగరంలో హైటెక్‌ సిటీని నిర్మించాడా?.. భీమవరంలో కనిపిస్తోందా? ఇన్ని ప్రధాన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా? ప్రత్యేక హోదా తెచ్చాడా? సూపర్‌ సిక్స్, సెవన్‌ అంటూ ఇప్పుడు మళ్లీ మోసాలకు బాబు తయారు.

వెలిగించండి ఫోన్లలో టార్చిలైట్లు..
ఇవాళ ఎక్కడైనా లంచాలు అనే మాట వినిపిస్తోందా? 58 నెలల్లో ఎలాంటి వివక్ష లేని పారదర్శక వ్యవస్థలను తెచ్చింది మీ బిడ్డ కాదా? గతంలో పెన్షన్‌ కావాలంటే లంచం.. సబ్సిడీ లోన్లు కావాలన్నా లంచాలే.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే. మాయలు, మోసాలు చేసి గ్రాఫిక్స్‌ చూపించేవాడిని ఏమంటాం? ఛీటర్‌.. మోసగాడనే కదా? మాయలోడు అనేకదా అంటాం. మన ఖర్మ ఏమిటోగానీ ఐదేళ్ల క్రితం ఆ మనిషిని మనం ముఖ్యమంత్రి అని అన్నాం. చంద్రబాబు చరిత్రను ప్రతి ఒక్కరికీ వివరించండి.

మోసాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీరంతా సెల్‌ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొన­సాగాలన్నా, లంచాలు లేని పాలన కొన­సాగాలన్నా, వ్యవస్థలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లలో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి.

జగన్‌కు తోడుగా కోట్ల గుండెలు..
ఈ యుద్ధంలో తలపడటానికి మీరంతా సిద్ధమేనా? జగన్‌ ఎన్నడూ ఒంటరి కానే కాదు. మంచి చేసిన జగన్‌కు మద్దతుగా ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం తోడుగా ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో జగనే ఉండాలి.. జగనే రావాలి.. మా బిడ్డే కావాలి అని కోట్ల మంది దీవిస్తున్నారు. ఇంటికే వస్తున్న రూ.3 వేల పెన్షన్‌ అందుకుంటున్న అవ్వాతాతలు జగన్‌కు తోడుగా ఉన్నారు. అమ్మ ఒడి నుంచి చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నావడ్డీ, విద్యాదీవెన, వసతి దీవెన దాకా ప్రతి ఇంట్లో పథకాలు అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు నా తమ్ముడు, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు.

బాగుపడ్డ ఆస్పత్రులు, మెరుగైన ఆరోగ్యశ్రీ, విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, ఇంటివద్దే పరీక్షలు – మందులు .. వీటన్నిటితో జీవితాలు మెరుగైన పేదలంతా మాకు తోడుగా నిలబడే వ్యక్తి ఒక్క జగన్‌ మాత్రమేనని భావిస్తూ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. జగన్‌ ఉంటేనే స్కూళ్లు, పిల్లల చదువులు బాగుంటాయని, మరో 10–15 ఏళ్లలో మా బిడ్డలు కూడా పెద్దవారి పిల్లల మాదిరిగా అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు.

ఒక్క జగన్‌ ఉంటేనే క్రమం తప్పకుండా రైతు భరోసా వస్తుందని, గ్రామాల్లో ఆర్బీకేలు పని చేస్తాయని, దళారీలు లేకుండా పంటను అమ్ముకునే పరిస్థితి ఉంటుందని నమ్ముతూ ప్రతి రైతన్నా నాకు తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి జరిగింది కాబట్టే ప్రతి ఇంట్లోనూ జగన్‌కు అండగా ఉన్నారు. మరి ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉండగా జగన్‌ ఒంటరి కానే కాదు. 

హత్యాయత్నంపై దిగజారుడు వ్యాఖ్యలా?
నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపించే ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం చేయడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. జగనన్నను ఆప్యాయంగా చేయి పట్టుకుని పలకరించేందుకు లక్షలాది మంది తరలివ­చ్చారు. భగవంతుడి దయ వల్ల సీఎంకు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటుంటే మానవత్వం లేని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చూస్తుంటే గుండెలు తరుక్కుపో­తు­న్నాయి.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 60 ఏళ్లకే రూ.3 వేల చొప్పున íపింఛన్లను ఇంటివద్దే అందిస్తున్నందుకు కక్ష గట్టారా? నిరుపేద బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నందుకు కక్షగట్టారా? సీఎం జగన్‌కు కోట్లాదిమంది ఆశీర్వాదం ఉంది. స్వల్ప వ్యవధిలో సీఎం రెండోసారి భీమవరం రావడం సంతోషంగా ఉంది.  పశ్చిమ గోదావరిపై ప్రత్యేకమైన ప్రేమాభిమా­నాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. 
– గ్రంధి శ్రీనివాస్, ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement