
సాక్షి, తాడేపల్లి: పెద్దబాబు, చిన్నబాబుకు ఇంకా అధికార దర్పం దిగలేదని.. ప్రతిపక్షంలోనూ అధికారంలో ఉన్నట్లు ఫీలవుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అధికారులపై దాడులు చేసిన వ్యక్తులను వెనకేసుకొచ్చిన ఘనత చంద్రబాబుదని, దళిత మహిళను వివస్త్రను చేసిన వారిపై ఆయన ఏ చర్యలు తీసుకున్నారని అమర్‌నాథ్ ప్రశ్నించారు. (కుట్రకు టీడీపీ పక్కా ప్లాన్: మంత్రి బొత్స)
ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండి..
‘‘అయ్యన్నపాత్రుడు మీద తప్పుడు కేసులు పెట్టారని డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆయన మహిళ ఉద్యోగిపై ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోండి. బట్టలు ఊడదీస్తానని మహిళ ఉద్యోగిని బెదిరించారు. మహిళలపై అనుచిత వాఖ్యలు చేసిన అయ్యన్నపై కేసులు పెట్టకపోతే ముద్దులు పెడతారా..? నాలుగు సార్లు మంత్రిగా పని చేసిన అయ్యన్న.. ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా.. మహిళలు పట్ల చంద్రబాబు నేర్పిన సంస్కారం ఇదేనా’’ అంటూ అమర్‌నాథ్ నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో ఎంతో మంది మహిళలను వేధించారన్నారు. ‘‘మహిళా ఉద్యోగిని జట్టు పట్టుకుని లాక్కొచ్చిన తీరు చూశాం. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ వ్యక్తులపై చర్యలు శూన్యం. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లోని టీడీపీ నేతలపై చర్యలు చేపట్టారా’’ అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజాపై అక్రమంగా కేసులు పెట్టారని, కోర్టు అనుమతించిన కానీ అసెంబ్లీలో ఆమెను అడుగు పెట్టనివ్వలేదన్నారు. (నాపై దాడికి లోకేష్ ప్రోద్బలమే కారణం)
ఆయనకు బీసీలు అండగా ఉండాలా..
చంద్రబాబు చేసిన అరాచకాలతో టీడీపీ 23 సీట్లకు పరిమితమయ్యిందని విమర్శించారు. మహిళలు పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని సీఎం జగన్ వదలి పెట్టరని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. మహిళల కోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. వారి రక్షణ కోసం దిశ చట్టం తెచ్చారన్నారు. మహిళలకు అండగా, అన్నగా వైఎస్ జగన్ నిలుస్తున్నారని తెలిపారు. ‘‘రూ.150 కోట్లు ప్రజాధనం పందికొక్కులా మింగేసిన అచ్చెన్నాయుడికి అండగా బీసీలు ఉండాలా..ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ని లోకేష్ పరామర్శిస్తారు. గవర్నర్ వ్యవస్థ వద్దని వాదించిన చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని గవర్నర్ ను కలుస్తున్నారంటూ’’ అమర్‌నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు.