
సాక్షి, విజయవాడ: మహానాడులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీర్మానాలు చూసి జనం నవ్వుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ పదవి కోసం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఆయన ఫొటోకు దండేసి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొని, అందులో నలుగురిని మంత్రులను చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని బాబూ మర్చిపోయారా అంటూ రోజా ధ్వజమెత్తారు. (నీకు జగన్ మామయ్య ఉన్నాడని అమ్మ చెప్పింది)
ఆ ఘనత ఆయనదే..
రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలు ఎవరూ చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 10 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మద్యం దశలవారీ నిషేధం, మహిళలకు సున్నా వడ్డీ, 27 లక్షల ఇళ్ల పట్టాలు, 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. 33 పథకాలు చంద్రబాబు పెడితే పథకానికి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జనం ఎందుకు ఛీ కొడతారని ప్రశ్నించారు.
ప్రజలు మూలన కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ మ్యానిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. మేనిఫెస్టోను చంద్రబాబు టీడీపీ వెబ్‌సైట్ నుంచి తొలగించారని రోజా గుర్తు చేశారు. సీఎం జగన్ పాలనను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని పేర్కొన్నారు.(ప్రజాస్వామ్యానికి ప్రమాదం చంద్రబాబే)
Comments
Please login to add a commentAdd a comment