
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నరాజమహేంద్రవరం, పార్లమెంటు వైయస్సార్ సీపీ అభ్యర్థి మార్గాని భరత్
సాక్షి, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తనను రాజమహేంద్రవరం ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని ‘నవ’ ప్రణాళికలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని వైఎస్సార్ సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్ హామీ ఇచ్చారు. షెల్టాన్ హోటల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలను ప్రకటించిన మాదిరిగా రాజమహేంద్రవరం ఎంపీ నియోజకవర్గ అభివృద్ధికి తాను ‘నవ’ ప్రణాళికలను రూపొందించుకున్నట్టు చెప్పారు. వీటి అమలుకు పార్టీ అధినేత అనుమతి పొందినట్టు చెప్పారు. ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లోనే నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు శ్రీకారం చుడతానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండోర్ స్టేడియం కూడా నిర్మిస్తామని, దాదాపు 10 రకాల క్రీడలకు వీలుగా ఉండే అకాడమీగా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని పాఠశాలలను భాగస్వామ్యం చేసి, ఏడో తరగతి నుంచే పిల్లలకు వారికి ఇష్టమైన ఏదో ఒక ఆటలో తర్ఫీదు ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నారు.
టూరిజమ్ హబ్‌గా..
గోదావరి పరివాహక ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా రూపుదిద్దే ప్రణాళికను సిద్ధం చేశానని ఆయన తెలిపారు. గోదావరిలోని లంకల ఎత్తు పెంచి ఫైవ్ స్టార్ రిసార్ట్స్‌ను నిర్మిస్తామని, ఇరిగేషన్ శాఖ అనుమతితో కృత్రిమ సరస్సుగా వృద్ధి చేసి, వాటర్ వరల్డ్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. గోదావరిలో స్పీడ్ బోట్లు, పారాచూట్ రైడింగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హేవ్‌లాక్ బ్రిడ్జికి అనుసంధానంగా పర్యాటక కేంద్రంగా, పాదచారులకు, సైక్లింగ్‌కు వీలుగా ఈట్ స్ట్రీట్‌గా, ఫ్యాషన్ స్ట్రీట్‌గా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. హేవ్‌లాక్ బ్రిడ్జి స్తంభం దగ్గర సెల్ఫీ పాయింట్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
అన్ని గ్రామాలకూ రక్షిత నీటి సరఫరా
గోదావరి తీరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉందని, వీటిలోని అన్ని గ్రామాలకు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి రక్షిత నీరు అందేలా కృషి చేస్తానన్నారు. గోదావరిలోకి డ్రైనేజీ వాటర్ కలవకుండా సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి, ఆ నీటిని కడియం నర్సరీలకు వినియోగించాలనేది తన ప్రణాళిక అని చెప్పారు. ద్వారకా తిరుమలలో ద్వారకను తలపించేలా ఎమ్యూజ్‌మెంట్ పార్కుగా తీర్చిదిద్దే యోచన ఉందన్నారు. మోరంపూడి, వేమగిరి, బొమ్మూరు, లాలాచెరువు ఫ్లైవర్ బ్రిడ్జిలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటానన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న డిజైన్లకు ప్రత్యామ్నాయంగా ఆయా సెంటర్ల ఉనికి కోల్పోకుండా ఉండేలా హైదరాబాద్ పీవీ నరసింహారావు ఫ్‌లైఓవర్ మాదిరిగా సింగిల్‌స్కెచ్‌గా తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం హెరిటేజ్‌ని కాపాడేలా హేవ్‌లాక్‌బ్రిడ్జి, బొమ్మూరు కాటన్‌గృహం, ధవళేశ్వరం కాటన్ మ్యూజియం ఇలా అన్నింటిని క్రోడీకరించి సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించే చర్యలు చేపడతామని చెప్పారు.
పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు యువతను ప్రోత్సహించి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధిఅవకాశాలు లభించే విధంగా తీసుకుంటామని, ఇక్కడ ఇంజినీరింగ్ కళాశాల్లో చదివిన విద్యార్థులు ఇక్కడే ఉపాధి పొందేలా చూస్తామని చెప్పారు. రాజమహేంద్రవరం–కాకినాడ జంటనగరాలుగా అభివృద్ధి చేయడానికి తమ వద్ద ప్రణాళిక ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా చేస్తామని జగన్ ప్రకటించిన విషయాన్నీ ఆయన గుర్తుచేస్తూ రాజమహేంద్రవరం జిల్లాను ఓ మోడల్ జిల్లాగా అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తన అభివృద్ధి ప్రణాళికను ఆడియో విజువల్‌గా రూపొందించి, సినీ నటుడు రాజారవీంద్ర చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పిల్లంగోళ్ల లక్ష్మి, కానుబోయిన సాగర్, గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.