సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని.. కానీ అసమర్థ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న గ్యాస్ లీకేజ్ బాధితులను గురువారం ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రూరల్ అధ్యక్షులు సరగడం చిన్నప్పల నాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆదిరెడ్డి మురళీ ఉన్నారు.
(‘భవిష్యత్తులో కూడా ఆదుకుంటాం’)
టీడీపీ తప్పుడు ప్రచారం..
ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఆయన కుమారుడు అప్పల నాయుడు చేస్తోన్న దుష్ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలో తండ్రీకొడుకులు నియోజకవర్గాన్ని దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారం దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గ్యాస్ లీకేజ్ ఘటనపై ఆరుగురు సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వకుండానే కంపెనీ తెరుస్తున్నారంటూ టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
(వలస కూలీలపై సీఎం జగన్ ఆవేదన)
రూ.10 వేలు పరిహారం..
విష వాయువు ప్రభావిత 5 గ్రామాలు మాత్రమే కాకుండా సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను కూడా ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన వివరించారు. గ్యాస్ లీక్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులంతా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు కూడా డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తామని.. ఒక పర్మినెంట్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.10వేల పరిహారాన్ని కూడా ప్రజలకు అందిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment