నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు
చిత్తూరు, రేణిగుంట: టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ మండల పరిషత్ నిధులను దోచుకుతింటున్న ఎంపీడీవో సుధాకర్‌రావు అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని రేణిగుంట మండల వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు పట్టుబట్టారు. రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన మండల మీట్‌కు వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది ఎంపీటీసీలు నల్లబ్యాడ్జీలను ధరించి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులమైన తమ హక్కులను ఎంపీడీవో కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతి పనిలోనూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలపై ఎంపీడీవో సమాధానం చెప్పాలని నిలదీశారు.
ఆయన నోరు మెదపకపోవడంతో ప్రతిపక్ష ఎంపీటీసీలు సుజాత, జయలలిత, గంగారి సుజాత, అన్బుయాదవ్, నాగసుబ్రమణ్యంరెడ్డి, ముద్దురాయులు, నారాయణరెడ్డి, వెంకటయ్య, గంగమణి, జ్ఞానమ్మ మీటింగ్ హాల్‌లో నేలపై కూర్చుని ఎంపీడీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి మద్దతుగా పార్టీ మాజీ జెడ్పీటీసీ తిరుమలరెడ్డి, మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పార్టీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సీఐ నాగరాజుయాదవ్, ఎస్‌ఐ మోహన్‌నాయక్ తమ సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులు, ఎంపీటీసీలతో చర్చలు జరిపారు. సుమారు గంటన్నర పాటు ఈ ఆందోళన జరిగింది. ఎంపీపీ స్వాతి, జెడ్పీటీసీ లీలావతి వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీలను సమావేశానికి హాజరుకావాలని కోరారు. వారు ససేమిరా అనడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ స్వాతి ప్రకటించారు. దీంతో మండల స్థాయి అధికారులు వెనుతిరిగారు. అనంతరం పార్టీ నాయకులు ఎంపీడీవో కోసం జోలిపట్టి భిక్షం ఎత్తారు.
Comments
Please login to add a commentAdd a comment