
ఒంగోలు రూరల్ మండలంలో బాలినేని వెంట సంఘీభావ యాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు
సాక్షి ప్రతినిధి,ఒంగోలు:ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు అధిగమించిన సందర్భంగా జిల్లాలో ఆపార్టీ శ్రేణులు గురువారం కూడా సంఘీభావ యాత్రలు నిర్వహించాయి. ఒంగోలు రూరల్ మండల పరిధిలోని చేజెర్ల, పానకాలపాలెం, కరవది గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. మండుటెండలోనూ ఉత్సాహంగా పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో బాలినేని వెంట నడిచారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు సంఘీభావ యాత్రలు చేసి, సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించారు. నవరత్నాలు పథకాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను నేతలు ప్రజలకు వివరించారు.
పొదిలి మండలం ముసి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తుళ్లూరు వరకు మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆద్వర్యంలో జగన్ యాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని అయ్యం బొట్లపల్లి నుంచి యర్రగొండపాలెం వరకు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించారు. రాచర్ల నుంచి గిద్దలూరు వరకు గిద్దలూరు సమన్వయకర్త ఐవీరెడ్డి, మద్దిపాడు మండలం కొస్టాలు నుంచి మద్దిపాడు వరకూ సంతనూతలపాడు సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్‌బాబు, కొరిశపాడు మండలం పమిడిపాడు నుంచి కనగాలవారిపాలెం వరకు అద్దంకి సమన్వయకర్త గరటయ్య ఆద్వర్యంలో జగన్ యాత్రకు మద్దతుగా సంఘీభావయాత్రలు నిర్వహించారు. కనిగిరి చెక్‌పోస్టు నుంచి వైఎస్సార్ విగ్రహం వరకూ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ పాదయాత్ర నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. చీరాల మండల దేశాయిపేట నుంచి వేటపాలెం వరకు పార్టీ చీరాల సమన్వయకర్త యడం బాలాజీ, ఇంకొల్లులో పర్చూరు సమన్వయకర్త రావి రామనాధం బాబుల ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించారు. అనంతరం ఆయా చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఇంకొల్లు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి పాల్గొన్నారు.