బూత్‌కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ బూత్‌కమిటీ కన్వీనర్లు
చౌడేపల్లె: దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీకి నిలబడాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. బుధవారం చిత్తూరు జిల్లా మండలంలోని బిల్లేరులో పుంగనూరు, చౌడేపల్లె మండలాలకు చెందిన బూత్‌కమిటీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతి థిగా హాజరయ్యారు. టీడీపీ నేత కిషోర్‌కుమార్‌రెడ్డి, మంత్రి అమరనాథరెడ్డి తనపై చేస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. కిషోర్‌కుమార్‌రెడ్డి స్వలాభం కోసమే టీడీపీలో చేరారన్నారు.
ఆయన్ను స్మగ్లర్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో విమర్శించారని.. అలాంటి వ్యక్తిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. మంత్రి అమరనాథరెడ్డిని గెలిపించింది తానేనని తెలిపారు. దివంగత ఎంపీ రామకృష్ణారెడ్డి తనయుడిగా అనేక తప్పుడు పనులు చేసి ఆయన పేరును దిగజార్చుతున్నారని అన్నారు. విమర్శలు చేస్తున్న వారు తనతో పోటీకి సిద్ధమా? అని సవాల్ విసిరారు. బూత్‌కమిటీ సభ్యులు వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ కార్యదర్శులు పెద్దిరెడ్డి, ఎన్.రెడ్డెప్ప, పోకలఅశోక్‌కుమార్, ఎంపీపీలు అంజిబాబు, నరసింహులు, జెడ్పీటీసీలు రుక్మిణమ్మ, వెంకటరెడ్డియాదవ్, నాయకులు గాజుల రామ్మూర్తి, భాస్కర్‌రెడ్డి, మిద్దింటి శంకర్‌నారాయణ, సింగిల్‌విండో చైర్మన్ మునస్వామిరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment