
నేటి నుంచి జిల్లాల్లో వైసీపీ ప్రధాన కార్యదర్శుల పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శులు ఈ నెల 25 నుంచి నవంబర్ 1 వరకూ ఎనిమిది రోజులపాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు, వి.విజయసాయిరెడ్డిలతో కూడిన ఈ ప్రధాన కార్యదర్శుల బృందం తమ పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రధానంగా సందర్శిస్తుందని శుక్రవారం పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వీరి పర్యటనల సందర్భంగా జరిగే సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చిస్తారు.
ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నవంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమానికి పార్టీని, ప్రజలను సమాయత్తం చేసే దిశగా ఈ చర్చలు సాగుతాయి. రైతుల రుణమాఫీ చేయకపోవడం, నిరుపేదలను పింఛన్ల జాబితా నుంచి తొలగించడం వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా నవంబర్ 5న ఆందోళనలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే. వివిధ స్థాయుల్లో పార్టీ కమిటీ ఏర్పాటు, జిల్లా పార్టీ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల ఎంపికపై కూడా ప్రధాన కార్యదర్శుల బృందం దృష్టి సారిస్తుంది. సమావేశాల్లో స్థానిక సమస్యలపై కూడా చర్చిస్తారు.