
ఎమ్మిగనూరు ఎస్సీ కాలనీలో నవరత్నాలపై అవగాహన కల్పిస్తున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నవరత్నాల పథకాలతో ప్రతి ఇంటికీ రూ.లక్షల్లో లబ్ధి చేకూరుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి రోజు రెండు పోలింగ్ బూత్‌ల్లో వైఎస్సార్‌సీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతున్నారు. టీడీపీ అవినీతి, అక్రమాలపై ప్రజలను చైతన్య పరచడంతోపాటు.. ఆరు నెలలు ఓపిక పడితే రాజన్న రాజ్యం జగనన్న ద్వారా సిద్ధిస్తుందని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే.. నవరత్నాలతో కలిగే లక్షల రూపాయల లబ్ధికి దూరమయ్యే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న విజ్ఞప్తికి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం గురువారం..జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. బండిఆత్మకూరు మండలం సోమయాజులపల్లెలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొని ఇంటింటా తిరిగి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలోని కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
కార్యక్రమంలో నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు పుల్లారెడ్డి పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం శాతనకోటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో బ్రహ్మానందారెడ్డి, శివారెడ్డి ఆధ్వర్యంలో గుత్తపాటి వెంకటరెడ్డి, మురళీ, శ్రీనివాసుల ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. కోవెలకుంట్ల మండలం రేవనూరులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండలం తాపినేనిపల్లెలో గంగుల బిజేంద్రారెడ్డి(నాని), కల్లూరు అర్బన్‌లోని 34వ వార్డులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాలలోని గాంధీ చౌక్ ఏరియాలో శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మిగనూరులోని ఎస్సీ కాలనీలో ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి..‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమాల్లో పాల్గొని నవరత్న పథకాలపై ఇంటింటా ప్రచారం చేశారు.
ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాలహర్వి మండలంలోని పచ్చర్లపల్లి, బాపురం, అమృతపురం, సిద్ధాపురం, మల్లూరు గ్రామాల్లో ఇంటింటా తిరిగి నవరత్నాల పథకాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం తుమ్మిగనూరులో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తనయుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మండల నాయకులు మురళీరెడ్డి, ఇల్లూరి ఆదినారాయణరెడ్డి, బూత్ కమిటీ కన్వీనర్ బెట్టన గౌడ్ పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర మండలం మదనంతపురంలో ఇన్‌చార్జి కంగాటి శ్రీదేవి, మండల నాయకులు మురళీధర్‌రెడ్డి, మల్లికార్జున యాదవ్, రాజశేఖరరావు పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలకు నవరత్నాలపై అవగాహన కల్పించారు.