ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పార్టీ గుర్తుపై గెలిచి తర్వాత ఫిరాయించినవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ నేతలు పాల్పడుతున్న అనైతిక చర్యల్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ‘సేవ్ డెమొక్రసీ’ కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా హాజరై వాయిస్ ఆఫ్ వైఎస్సార్, ప్రజాస్వామ్య రణభేరి, సేవ్ డెమొక్రసీ అంటూ నినదించారు.
సీఎం డౌన్ డౌన్..వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా తక్షణమే రాజీనామా చేయాలి..మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ నినదించారు. సూర్యమహల్ జంక్షన్ నుంచి కార్యకర్తలు, నేతలు సేవ్ డెమొక్రసీ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. జీటీ రోడ్డు మీదుగా వైఎస్సార్ కూడలి వరకు భారీగా కొవ్వొత్తులు, కాగడాలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మానవహారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మాన మాట్లాడుతూ 2003లో ప్రస్తుత కేంద్రమంత్రి, అప్పటి న్యాయమంత్రి అయిన అరుణ్‌జైట్లీ పార్టీ ఫిరాయింపులపై దేశ ప్రజల కోరిక మేరకు సరవణ తీసుకువచ్చారని ధర్మాన అన్నారు.
రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారు : తమ్మినేని
చంద్రబాబు రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. పార్టీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎన్నికలు ప్రకటించాలన్నారు. అసెంబ్లీలో కనిపించకుండా డబ్బుకోసం కొంతమంది ఎమ్మెల్యేలు తాపత్రయపడ్డారని విమర్శించారు. స్పీకర్ వ్యవహారశైలి రాజ్యాంగానికి భిన్నంగా ఉందని, మహిళా ఎమ్మెల్యే రోజా వ్యవహారంపై నేతలు మిన్నకుండిపోవడాన్ని చూస్తోంటే జాలేస్తుందన్నారు. ప్రజావాణి వినిపించాల్సిన ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోయారని ఆరోపించారు. తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు వ్యవస్థల్ని కాలరాస్తున్నారన్నారు.
మనం ఎటు వెళ్తున్నాం..?
పార్టీ ఫిరాయింపుల్ని నిరోధించాలని చట్టం తెచ్చినప్పటికీ ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా సీఎం చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్నేల్ని కొంటున్నారని ధర్మాన ఆరోపించారు. ప్రజలు, ఇతర పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, జాతీయ స్థాయిలో ఈ విషయమై ఖండించాలని డిమాండ్ చేశారు. డబ్బు, పదవులు ఆఫర్ చేసి చంద్రబాబు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా, స్పూర్తికి విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని ధర్మాన అన్నారు. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా రాజ్యంగానికి విలువ లేనట్టుగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఈనెల 25న ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారన్నారు. అవసరమైతే ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని రాష్ట్రంలో జరుగుతున్న తంతును వివరించే ప్రయత్నం చేస్తామని ధర్మాన అన్నారు.
బలమైన ప్రతిపక్షం మాదే: కంబాల
టీడీపీ పరిస్థితి బాగోలేకనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుంటోందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు ప్రజలు త్వరలోనే స్వస్తి చెబుతారన్నారు. సీఎం చంద్రబాబు ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దీనిని అంతా గుర్తించాలని కోరారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం అని, వైఎస్సార్‌సీపీ తరఫున ప్రజలకు న్యాయం కలిగిలే, చంద్రబాబు వైఖరిలో మార్పు రాకపోతే ఉద్యమాల్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా విభాగం ఇన్‌చార్జి వరుదు కల్యాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావు, జుత్తు జగన్నాయకులు, గొర్లె కిరణ్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు, పార్టీ అధికార ప్రతినిధులు ఎన్ని ధనుంజయ్, శిమ్మ రాజశేఖర్, జె.జె. మోహన్‌రావు, రొక్కం సూర్యప్రకాశరావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పేరాడ తిలక్, సురంగి మోహన్‌రావు, కోరాడ రమేష్, టొంపల సీతారం, ముంజేటి కృష్ణ, పార్టీ సీనియర్ నేతలు పాలవలస రాజశేఖరం, అంధవరపు వరం, అంధవరపు సూరిబాబు, మహిళా నేతలు ఎంవి పద్మావతి, కామేశ్వరి, పార్టీ రూరల్ నేతలు, మామిడి శ్రీకాంత్, స్వరూప్, పొన్నాడ రుషి, ఆర్‌ఆర్ మూర్తి, డా.శ్రీనివాస పట్నాయక్, కార్యకర్తలు హాజరయ్యారు.