
సాక్షి, విశాఖపట్టణం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో చేసింది లాంగ్ మార్చ్ కాదు, ఈవినింగ్ వాక్ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. పవన్ విజయసాయి రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని విమర్శించారు. నాయకత్వ లక్షణాలు లేని నీకు రాజకీయాలెందుకని విరుచుకుపడ్డారు. రెండు కిలోమీటర్లు కూడా నడవకుండా లాంగ్ మార్చ్ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. నిన్నటి వరకు నీ అన్న చిరంజీవిని విమర్శించిన అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడుల పక్కన కూర్చోడానికి సిగ్గుగా అనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం తరపున టిక్కెట్లు నీవు ఇవ్వలేదు. ఒకవేళ నువ్వే ఇచ్చినా చాలా మంది ఓడిపోయారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పవన్ మానసిక స్థితి బాగోలేదని, ఆయన్ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మీకు తాట తీయడం తెలిస్తే, మాకు తోలు తీయడం తెలుసంటూ పవన్‌ను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment