అంగన్‌వాడీల కోసం వైసీపీ వాకౌట్
* అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల జీతాలు పెంచాలని సభలో పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్
* సూటిగా సమాధానం చెప్పని మంత్రి
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయలకు జీతాల పెంపుదల విషయంలో తగిన సమాధానం రాకపోవడంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ శుక్రవారం శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, ఆర్‌కే రోజా, గిడ్డి ఈశ్వరి, గౌరు చరితారెడ్డి, విశ్వసరాయి కళావతిలు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు చాలీచాలని జీతాలతో అల్లాడుతున్నారని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా ప్రభుత్వం కష్టాల్లో ఉందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జోక్యం చేసుకుంటూ అంగన్‌వాడీ కార్యకర్తలకు, సహాయకులకు జీతాలు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పుడేమో ఆ ప్రస్తావన కూడా చేయకపోవడం అన్యాయమని, నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు.
డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చండి
రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం మృతి చెందుతున్నారని, ఈ జబ్బును ఆరోగ్యశ్రీలో చేర్చి ఆదుకోవాలని వైసీపీ శాసనసభ్యులు పీడిక రాజన్న దొర డిమాండ్ చేశారు. మంత్రి కామినేని శ్రీనివాస్ సమాధానమిస్తూ, డెంగీ బాధితుల్లో 5 శాతం మందికే సీరియస్‌గా ఉంటోందని, మిగతా వారికి ఇబ్బంది ఉండదన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ప్రతి జిల్లాకు వైద్యకళాశాల ప్రతిపాదనలు ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉన్నా యా అని వైసీపీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎం.సునీల్‌కుమార్ ప్రశ్నిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సమస్యలపై వైసీపీ సభ్యులు కోన రఘుపతి, ఆదిమూలపు సురేష్, గిడ్డి ఈశ్వరిలు తీవ్రంగా విమర్శించా రు. మంత్రి గంటా శ్రీనివాస్ స్పందిస్తూ, సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందేలా చర్యలు తీసుకుంటామని, వాటి సరఫరా బాధ్యతలు ఆప్కోకు ఇచ్చామని చెప్పారు.