ప్రతిపక్షంలో ఉన్నా పోరాడే సత్తా ఉంది
పాలకొండ రూరల్, న్యూస్‌లైన్: ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పోరాడే సత్తా తనకుందని, తాను ఇతర పార్టీల వైపు వెళుతున్నట్లు వస్తున్న వదంతులు అసత్యమని, తాను వైఎస్సార్‌సీపీలోనే కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నాని పాలకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విస్వాసరాయి కళావతి అన్నారు. శనివారం ఆ పార్టీ సీజేసీ సభ్యుడి నివాసగృహంలో సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిసారిగా పాలకొండలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వదంతులను ప్రజలెవ్వరూ నమ్మెద్దని ఆమె సూచించారు. పాలకొండలో ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంతో పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు మేరకు తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఇక్కడి సమస్యలను విన్నవించామని, వాటి పరిష్కారానికి ఆయన సానుకూలంగా మాట ఇవ్వడంతో రానున్న రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రుణమాఫీ అమలు జరిగితే తొలుత ఆనందించేది తామేనన్నారు. పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్త పాలవలస విక్రాంత్, మండల కన్వీనర్ కనపాక సూర్యప్రకాశరావు, పాలవలస ధవళేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.