పాల‘కొండ’పై కళావతి | ysrcp candidate kavitha win in PALAKONDA | Sakshi
Sakshi News home page

పాల‘కొండ’పై కళావతి

Published Sat, May 17 2014 2:45 AM | Last Updated on Tue, May 29 2018 5:24 PM

పాల‘కొండ’పై కళావతి - Sakshi

పాల‘కొండ’పై కళావతి

 పాలకొండ,న్యూస్‌లైన్:‘ఊహించిందే జరిగింది. గిరిజనులంతా తమ ఆడపడుచుకు పట్టం కట్టారు. పాలకొండ నియోజకవర్గంలో గిరిజనులు, గిరిజనేతరులంతా తమ పూర్తి మద్దతు ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  విశ్వాసరాయి  కళావతి తొలిసారి ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి, తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 1620 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 18 రౌండ్లలో ఎక్కడా మెజార్టీ చేదాటకుండా తొలినుంచి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఎక్కడా ప్రత్యర్ధి విజయావకాశాలను దరిచేరనివ్వలేదు.
 
 శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకే ముగిసి విజేతను ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు పక్కాగా చర్యలు చేపట్టారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీకి మధ్యేనే పోరు సాగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కళావతికి 54,905 ఓట్లు, టీడీపీ అభ్యర్థి జయకృష్ణకు 53,352 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి  తాజా మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులుకి కేవలం 3,147 ఓట్లు మాత్రమే వచ్చాయి.  ఇక అరుకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కూడా ఈ నియోజకవర్గంలో 18 రౌండ్లలో మొత్తం 54,812 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి  గుమ్మిడి సంధ్యారాణికి 52,735 ఓట్లు రాగా, కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్‌కు ఘోరంగా 4,165 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కొత్తపల్లి గీతకు పాలకొండ నియోజకవర్గం నుంచి 2077 ఓట్లు ఆధిక్యత వచ్చింది. ఇదిలావుంటే మొత్తం 18 రౌండ్లలో ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరగలేదని మెజార్టీలు వచ్చిన తీరు స్పష్టం చేస్తోంది.
 
 ఆది నుంచీ మెజార్టీతోనే...
 శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మెజార్టీని వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కళావతి సాధించారు. మొదటి 8 రౌండ్ల వరకు పూర్తి స్థాయి మెజార్టీతో వెళ్లగా, అక్కడి నుంచి 14వ రౌండ్ల వరకు టిడిపి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత మళ్లీ 15, 18 రౌండ్లలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ సాధించడంతో విజయం ఖరారయ్యింది. అయితే 1 నుంచి 7 రౌండ్ల వరకు సీతంపేట మండలంలో వైఎస్సార్‌సీపీకి 7,214 ఓట్లు భారీ మెజార్టీ రాగా, ఆ తర్వాత మొదలైన 8, 9 రౌండ్లలో భామిని మండలంలో లెక్కింపు ప్రారంభం కాగా, 9 వ  రౌండ్ నుంచి టీడీపీకి ఆధిక్యత కనబర్చింది. తర్వాత 10 నుంచి 14వ రౌండ్ వరకు పాలకొండ మండలం, పట్టణంలో ఆధిక్యతను సంపాదించుకుని టీడీపీ కాస్తా పోటీ ఇచ్చినట్లు కన్పించింది. అయితే చివరల్లో 15 నుంచి 18 రౌండ్ల పరిధిలోని వీరఘట్టం మండలంలో మళ్లీ కాస్తా ఆధిక్యత రావడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కళావతికి విజయం దక్కింది. పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు 1092  పోలవ్వగా..అందులో వైఎస్సార్‌సీపీకి  432,  టీడీపీకి 365 ఓట్లు వచ్చాయి. ఎంపీ అభ్యర్థికి కూడా ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చినట్టుగానే అన్ని రౌండ్లలో అధిక్యత వచ్చింది.
 
 మూడంచెల భద్రత నడుమ
 జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో శివాని కళాశాలలో లెక్కింపు చేపట్టగా, ఒక్క పాలకొండ అసెంబ్లీ, అరుకు ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపును మాత్రం పాలకొండలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బలగాలతో అదనపు బెటాలియన్‌లతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత కల్పిస్తూ కౌంటింగ్‌లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎన్. తేజ్‌భరత్, పరిశీలకుడు బల్వీందర్ సింగ్, డీఎస్పీ దేవానంద శాంతోల ఆధ్వర్యంలో ప్రశాతంగా లెక్కింపు ప్రక్రియను ముగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement